Sun Dec 15 2024 23:46:11 GMT+0000 (Coordinated Universal Time)
హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో ఛేజింగ్.. అంబులెన్స్ చోరీతో అలెర్ట్
హైద్రాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై పోలీసులు ఛేజింగ్ చేశారు. అంబులెన్స్ ను చోరీ చేసిన దొంగ కోసం అలెర్ట్ చేశారు
హైద్రాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై పోలీసులు ఛేజింగ్ చేశారు. యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్, ఫైటింగ్ వంటి దృశ్యాలు కనిపించాయి. హయత్ నగర్ లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు ఒక వ్యక్తి పారిపోతున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు వెంబడించారు. దొంగను పట్టుకునేందుకు హైవేపై పోలీసులు అలెర్ట్ అయ్యారు. హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా అంబులెన్స్ దొంగ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. అంబులెన్స్ సైరన్ తో రయ్ రయ్ మంటూ అతి వేగంతో పరారీకి దొంగ ప్రయత్నించాడు.
ఛేజ్ చేసి పట్టుకోవడానికి...
అయితే పోలీసులు అంబులెన్స్ తో పారిపోతున్న దొంగను ఛేజ్ చేసి పట్టుకోవడానికి టోల్ ప్లాజాల వద్ద వాహనాలను అడ్డంగా ఉంచారు. అయినా సరే దొంగ అంబులెన్స్ తో అతి వేగంగా నడుపుతూ టోల్ ప్లాజాల వద్ద అడ్డంగా పెట్టిన వాహనాలను దాటుకుంటూ స్పీడ్ గా వెళ్లాడు. అంబులెన్స్ ను హైదరాబాద్ లో చోరీ చేసి విజయవాడకు తీసుకెళ్లాలన్నది దొంగ ప్రయత్నమని భావించిన పోలీసులు హైవే మొత్తం అలెర్ట్ చేశారు. చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి పారిపోయాడు. దీంతో దొంగ కోసం కొన్ని బృందాలు ప్రయత్నంచాయి.
ఎట్టకేలకు పట్టుకుని...
జాన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ ను ఢీకొట్టి పారిపోయాడు. సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే గతంలోనూ ఇదే వ్యక్తి అంబులెన్స్ ను దొంగిలించాడని చెబుతున్నారు. అంబులెన్స్ ను దొంగిలించి ఎవరికి విక్రయించాలనుకున్నాడు? ఎందుకు దొంగిలించాడన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
Next Story