Wed Jan 08 2025 17:50:15 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్లో తగ్గిన రిజిస్ట్రేషన్ ఆదాయం.. నిలిచిన ఇళ్ల కొనుగోళ్లు
హైదరాబాద్ నగరంలో ఇళ్ల స్థలాల కొనుగోళ్లు తగ్గిపోయాయి. ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండిపడింది
భయపడినట్లే జరిగింది. హైదరాబాద్ నగరంలో ఇళ్ల స్థలాల కొనుగోళ్లు తగ్గిపోయాయి. ఇళ్లను, ఇంటి స్థలాలను కొనుగోలు చేయడానికి పెద్దగా ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండిపడినట్లు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని బట్టి తెలుస్తుంది. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కొనేవారు లేరు.. అరకొరగా ఇళ్లు,ఇళ్ల స్థలాల కోసం ఎంక్వైరీ చేస్తున్నారు తప్పించి గతంలో ఉన్న మాదిరిగా మాత్రం ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. అంత డబ్బు పోసి కొనుగోలు చేస్తే ఏమవుతుందోనన్న భయం వారిని వెనకు అడుగు వేసేలా చేస్తుంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ఒకరకంగా స్తబ్దుగా ఉంది. నిర్మాణాలు కూడా అనేక చోట్ల నిలిచిపోయినట్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సగం పూర్తి చేసిన నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేశారు.
రెండు కారణాలతో...
దీనికి ప్రధాన కారణం. రెండు. ఒకటి హైడ్రా కూల్చివేతలు. రెండోది మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. లావాదేవీలేవీ జరగడం లేదని చెబుతున్నారు. బఫర్ జోన్ పరిధి, ఎఫ్టీఎల్ పరిధిలో ఏవి ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో ఏది కొంటే ఏ ప్రమాదమోననని కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. హైడ్రా అధికారులు తాము అన్నీ అనుమతులు ఉంటే కూల్చివేయడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ అనుమతులు ఉన్న వాటి జోలికి పోమని కూడా హైడ్రా కమిషనర్ రంగనాధ్ పదే పదే చెబుతున్నప్పటికీ అవి జనం చెవుల్లోకి ఎక్కడం లేదు. కూల్చివేతల దృశ్యాలే కళ్లముందు కదులుతుండటంతో ఎక్కువ మంది ఇంటి స్థలాలను, విల్లాలను, అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని, దీనివల్ల తమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్లు తగ్గడంతో...
గతంలో కళ్లుమూసుకుని అన్ని అనుమతులను పరిశీలించిన తర్వాత కొనుగోలు చేసేవారని, కేవలం రేటు వద్దనే కొద్దిగా బేరసారాలు జరిగేవని, కానీ అసలు బేరమాడటానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా ఈ మూడు నెలల కాలంలో దెబ్బతినిందని చెబుతున్నారు. మూసీ నది పక్కనే లేనప్పటికీ ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతాలు మూసీ నది కిందకు వస్తాయేమోనని భావించి కొందరు వెనుకంజ వేస్తున్నారని రియల్టర్లు చెబుతున్నారు. దీంతోతో గృహాల కొనుగోళ్లు భారీగా తగ్గిపోయిన గత సంవత్సరం అక్టోబర్ కంటే ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో 24% రిజిస్ట్రేషన్ల రాబడి తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నియా. ఇళ్లు కొనడానికి ఎన్ఆర్ఐలు అస్సలు ముందుకు రావడం లేదు. గతేడాది అక్టోబర్ 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల నుంచి రూ.1221.82 కోట్లు ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి రాగా, ఈ సంవత్సరం రూ.923.30 కోట్లు మాత్రమే వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అలాగే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో రూ.1161.54 కోట్లు ఆదాయం రాగా.. గత నెలలో రూ.857.83 కోట్లు మాత్రమే వచ్చిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Next Story