Wed Mar 26 2025 18:51:40 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : ఇంత జరుగుతున్నా హైడ్రా అధికారులు మారరా?
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది.కానీ హైడ్రా అధికారులు మాత్రం తమ పనిని మాత్రం ఆపడం లేదు

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. కానీ హైడ్రా అధికారులు మాత్రం తమ పనిని మాత్రం ఆపడం లేదు. అస్సలు హైడ్రా దూకుడు కారణంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందన్న ఆరోపణలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక వెంచర్లు అమ్ముడు పోకుండా నిలిచిపోయాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి రియల్టర్లు నిర్మించిన భవనాలు సేల్ కాకపోవడంతో కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అయినా హైడ్రా అధికారులు మాత్రం ఆగడం లేదు. ఇంకా కూల్చివేతలను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే సెలవు రోజులను చూసి కూల్చివేస్తుండటంతో హైకోర్టు కూడా హైడ్రా అధికారులపై అక్షింతలు వేసింది.
హైకోర్టు ఆగ్రహం...
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయడంపై సీరియస్ అయింది. నోటీసులు ఇచ్చి వివరణకు సమయం ఇవ్వాలని..ఎన్నిసార్లు చెప్పినా వినరా అంటూ హైడ్రా అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలానే చేస్తే హైడ్రా మూసేయాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించదంటే ఏ మేరకు రియాక్ట్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు దీనికి తోడు రాత్రికి రాత్రే నగరాన్ని మార్చుతారా అంటూ హైకోర్టు హైడ్రా అధికారులను ప్రశ్నించింది. హైడ్రా ఏర్పాటు అయిన నాటి నుంచి ఎలాంటి నోటీసులు లేకుండానే నిబంధలు పాటించ లేదని భవనాలను కూల్చివేస్తున్నారు. కాల్వలు, చెరువులను రక్షిస్తున్నామని చెబుతున్నప్పటికీ అది తెలియకుండా మిగిలిన వెంచర్లపై కూడా పడింది.
తప్పుపట్టకపోయినా...
హైడ్రా అధికారుల తీరును ఎవరూ తప్పు పట్టకపోయినా అది వ్యవహరించే తీరు సరికాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ముందుగా నోటీసులు ఇవ్వడం, చట్టప్రకారం చర్యలు తీసుకుంటే ఎలాంటి విమర్శలుండవు. అలా కాకుండా నేరుగా బుల్ డోజర్లను తీసుకుని అక్రమ నిర్మాణాలంటూ నిర్ధారించి వాటిని కూల్చివేయడంతో బయట ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. అందువల్లనే హైదరాబాద్ లో ఫ్లాట్ల కొనుగోళ్లు తగ్గాయని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా హైడ్రా అధికారుల దూకుడుకు కొంత వరకూ కళ్లెం వేయకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత దెబ్బతినే అవకాశముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
Next Story