Thu Apr 10 2025 13:54:27 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad Real Estate : హైదరాబాద్ లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు...రియల్ రంగం కుదేలు
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కొంత కుదుపుకు లోనవుతుంది. కొనేవారు లేక అనేక వెంచర్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కొంత కుదుపుకు లోనవుతుంది. కొనేవారు లేక అనేక వెంచర్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. గతంలో వెంచర్ ప్రారంభానికి ముందే అడ్వాన్స్ బుకింగ్ తో మొత్తం అమ్ముడుపోయేవని, ఇప్పుడు ప్రీ బుకింగ్స్ లేకపోగా నిర్మాణాలు కూడా పూర్తయిన ఫ్లాట్లను కొనుగోలు చేసే అవకాశం కనిపించడం లేదని రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయిందా? హైడ్రా దెబ్బకు హడలెత్తిపోయి కొనుగోలు చేయడం లేదా? అన్నది స్పష్టత లేకపోయినా కొనుగోళ్లు తగ్గిపోవడంతో కొందరు బిల్డర్లు బలవన్మరణానికి కూడా పాల్పడుతున్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో అనేక వెంచర్లు కొనేవారు లేక వెలవెల బోతున్నాయి.
ఆఫర్లు ఇస్తున్నా...
ముందుగా నిర్మాణాలు పూర్తయిన కొన్ని ప్రముఖ సంస్థలు ఆఫర్లు కూడా భారీగానే ప్రకటిస్తున్నాయి. ఇంటీరియర్ ఫ్రీ అంటున్నాయి. మాడ్యులర్ కిచెన్ ఫ్రీగా చేస్తామని చెబుతున్నాయి. పార్కింగ్ ఉచితం అని చెబుతున్నారు. కొన్ని నిర్మాణ సంస్థలయితే రిజిస్ట్రేషన్ ఫీజు లో కూడా రాయితీలను ప్రకటిస్తున్నాయి. అయినా కొనేనాధుడే కరువయ్యారు. మరొకవైపు ఎన్ఆర్ఐలు ఎక్కువగా పెట్టుబడి పెట్టేవారు. అక్కడ ఉండి ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేసేవారు. కానీ వారు కూడా హైడ్రా నిబంధనలు ఎంత మేరకు అప్లయ్ అవుతాయో? ఏ బిల్డర్ ను నమ్మాలన్నది తెలియక కొనడం మానేశారు. దీంతో వారి సొంత ఊళ్లలో వ్యవసాయ భూమి కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
మూడు నెలల్లో...
మరోవైపు కొత్తగా ఉద్యోగాలు సంపాదించుకుని అమెరికాలో స్థిరపడిన వారు కూడా ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చేవారు. అమెరికా వెళ్లి సంపాదన మొదలవ్వగానే హైదరాబాద్ లో సొంత ఇంటిని కొనుగోలు చేయడం ఒక అలవాటుగా మార్చుకునే వారు. కానీ ఇప్పుడు ట్రంప్ రాకతో ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి వచ్చింది. పార్ట్ టైం ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో అటువంటి వారు కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదు. దీంతో హైదరాబాద్లో 22శాతం ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. గత మూడు నెలల్లో అమ్ముడు పోయింది కేవల పదహారు వేలు మాత్రమేనట. ఒక్క ఏడాదిలోనే ఐదు వేల యూనిట్లు తగ్గాయని క్రెడాయ్-సీఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదిక వెల్లబించింది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్లు కూడా తగ్గడం ఇందుకు నిదర్శనం.
Next Story