Mon Dec 23 2024 02:49:50 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఫ్లాట్లు కొన్న వారికి భారీ ఆఫర్లు.. హైదరాబాద్లో "రియల్" సీన్
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఒకరకంగా ఇబ్బందులు పడుతుంది. కొనేవారు లేక అనేక ఫ్లాట్లు మిగిలిపోతున్నాయి.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఒకరకంగా ఇబ్బందులు పడుతుంది. కొనేవారు లేక అనేక ఫ్లాట్లు మిగిలిపోతున్నాయి. దీంతో బిల్డర్లు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. నిర్మాణాలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో పాటు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా తగ్గింది. దీనికి అనేక కారణాలున్నాయి. ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగిరం జరుగుతుండటంతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కొంత రియల్ ఎస్టేట్ ఏపీ వైపు మళ్లిందని చెబుతున్నారు. ప్రధానంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కొంత రియల్ రంగం ఊపందుకుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లో కొంత పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య తగ్గింది.
ఏపీలో పెట్టుబడులు...
ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు కూడా ప్రస్తుతం హైదరాబాద్ వైపు కాకుండా అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల వైపు చూస్తున్నారన్నది కొంత మేరకు వాస్తవం. విశాఖ చుట్టుపక్కల శ్రీకాకుళం వరకూ వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ కంపెనీలు అక్కడ దుకాణాలు తెరిచాయి. అదే సమయంలో అక్కడ భూముల ధరలు తక్కువగా ఉండటంతో పెద్దయెత్తున భూములను కొనుగోలు చేసిన రియల్టర్లు భారీగా వెంచర్లు వేశారు. అయితే హైదరాబాద్ నగరంలో అంతకు ముందు వేసిన వెంచర్లు అలాగే ఉండిపోయాయి. కొన్ని అసంపూర్తి నిర్మాణాలు కాగా, మరికొన్ని పూర్తయిన ఫ్లాట్లు కూడా అమ్ముడు పోక రియల్టర్లు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు.
ఆఫర్లు ఇవే...
ముందుగా ఫ్లాట్ ను బుక్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ లో రాయితీలు కల్పిస్తామని కొందరు, మాడ్యులర్ కిచెన్ ఫ్రీగా చేయిస్తామని మరికొందరు, కారు పార్కింగ్ ఫ్రీ అంటూ ఇంకొందరు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఒడిదుడుకులు ఎదుర్కొనడంతో ఎక్కువ మంది ఇళ్లపై పెట్టుబడి పెట్టేందుకు సాహసించడం లేదన్న అభిప్రాయం వెలువడుతుంది. అందుకే భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొందరు బిల్డర్లయితే వుడ్ వర్క్ కూడా తామే చేయించి సిద్ధం చేసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని చూస్తున్నాయి. కొందరు అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల వెంచర్లలో అయితే ఈఎంఐలు ఏడాది పాటు తామే కడతామని కూడా ఆఫర్లు ఇస్తున్నాయి. ఇలా గతంలో ఎన్నడూ లేని ఆఫర్లు రియల్ రంగంలో కనిపిస్తున్నాయి. అయినా సరే కొనుగోళ్లకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే కొత్త ఏడాది నుంచి హైదరాబాద్ లో రియల్ బూమ్ పెరుగుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి.
Next Story