Mon Dec 23 2024 07:12:45 GMT+0000 (Coordinated Universal Time)
Dengue : హైదరాబాద్ కు "డెంగీ" ఫీవర్.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు
సీజన్ మారింది. దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో డెంగీ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది.
సీజన్ మారింది. దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో డెంగీ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాదాపు ఎనిమిది వందలకు పైగా కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటాయన్నది అంచనా. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ చెప్పే డెంగీ కేసులన్నీ ఎక్కువ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చినవే కావడంతో ఈ లెక్కల్లో వాస్తవం లేదనే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రయివేటు ఆసుపత్రులకు ఎక్కువ మంది వెళుతున్నారు. డెంగీ పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో గంటల తరబడి వెయిట్ చేయలేక ప్రయివేటు ఆసుపత్రులకు వెళుతున్నారు.
ప్రయివేటు ఆసుపత్రుల్లో....
ఈ లెక్కన చూస్తుంటే డెంగీ వ్యాధి విపరీతంగా హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఎక్కువ మంది జ్వరం బారిన పడుతుండటంతో ఆసుపత్రులకు వెళుతున్నారు. వారికి వైద్యులు డెంగీ పరీక్షలు విధిగా చేస్తున్నారు. ఒకవైపు వైరల్ ఫీవర్ ఉన్నప్పటికీ డెంగీ కొంత డేంజర్ కావడంతో వైద్యులు ఈ పరీక్షలు చేయిస్తున్నారు. ప్లేట్లెట్స్ సంఖ్య ఎలా ఉందన్నది తేల్చుకునేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది డెంగీ బారిన పడి తమ ఆసుపత్రులకు వస్తున్నారని, కొందరు ఇన్పేషెంట్లుగా చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే డెంగీ కారణంగా రెండు మరణాలు సంభవించడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది.
దోమల వ్యాప్తి....
సహజంగా వర్షాకాలం కావడంతో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీనిని అధిగమించేందుకు ఫాగింగ్ వంటివి చేస్తున్నా అనుకున్న స్థాయిలో దోమల నివారణ జరగడం లేదు. ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఇళ్లల్లో నీరు నిల్వ ఉంచుకుండా ఉండాలని, మనీ ప్లాంట్స్ వంటివి ఇళ్లలో ఉంటే దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. డెంగీ మరణాలు సంభవించడంతో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. నగరంలోని మురికివాడలు మాత్రమే కాదు జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లోనూ ఈ డెంగీ కేసులు నమోదయినట్లు వైద్యులు చెబుతున్నారు. సో.. ప్రభుత్వాన్ని నిందించే కంటే ప్రజలు దోమలు బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story