Mon Dec 23 2024 02:21:03 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేత.. అధికారిపై వేటు
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి బయట కూల్చివేతలపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి బయట కూల్చివేతలపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే తెలంగాణలో ఒక మంత్రి కీలకమైన మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో ఈ కూల్చివేతలు జరిగాయని చెబుతున్నారు. లోటస్ పాండ్ లో నిన్న జగన్ ఇంటి బయట ఉన్న సెక్యూరిటీ రూమ్ తో పాటు పలు నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కూల్చి వేతల వెనక ఒక మంత్రి ప్రమేయం ఉందని తెలిసింది. జగన్ ఇంటి బయట నిర్మాణాల కూల్చివేతలపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున దుమారం చెలరేగింది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా...
ముఖ్యమైన నిర్ణయాన్ని చీఫ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లకుండా జీహెచ్ఎంసీ అధికారి కూల్చివేతల నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు పడింది.హైదారాబాద్ లోటస్ పాండ్ వద్ద ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం ముందు అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేతపై ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా కూల్చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి గారి ఆదేశాలతోనే...
మంత్రి గారి ఆదేశాలతోనే జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఆ మంత్రిగారు చెప్పడం వల్లనే తాను కూల్చివేతల పనిని చేపట్టానని జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చినప్పటికీ ఆయనకు బదిలీ నుంచి మినహాయింపు లభించలేదు. ఎందుకంటే ఒక ముఖ్యమైన, కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే సమయంలో ఉన్నతాధికారులను సంప్రదించాలన్న కనీస సంప్రదాయాన్ని కూడా పాటించకపోవడంతో హేమంత్ బోర్కడే పై బదిలీ వేటు పడింది. ఇంతకూ జగన్ ఇంటిని కూల్చివేసిన మంత్రి ఎవరన్న చర్చ జోరుగా సాగుతుంది.
దక్షిణ తెలంగాణకు చెందిన...
అయితే అందిన సమాచారం మేరకు గతంలో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న మంత్రి చెప్పడం వల్లనే ఈ కూల్చివేతలను చేపట్టారని తెలిసింది. దక్షిణ తెలంగాణకు చెందిన ఈ మంత్రి అటు వైపు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న కారణంగా వాటిని తొలగించాలని జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే కు నేరుగా ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఈ పనికి పూనుకున్నారని చెబుతున్నారు. తన రాకపోకలకు అడ్డం వస్తుందన్న కారణంతోనే ఆక్రమణలను తొలగించాలని సదరు మంత్రి చెప్పారని, అయితే మంత్రి గారి ఆదేశం ఒక ఐఏఎస్ అధికారి పై వేటు పడటానికి కారణంగా మారింది. రాజకీయంగా భవిష్యత్ లో ఇది ఇబ్బంది కరంగా మారే అవకాశం ఉండటంతో ఆ అధికారిని వెంటనే బదిలీ చేసినట్లు సమాచారం.
Next Story