Fri Nov 22 2024 17:23:01 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : మరింత స్పీడ్ పెంచనున్న హైడ్రా..ఈసారి గురి వాటిపైనేనట?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. రానున్న కాలంలో మరింత స్పీడ్ పెంచనుంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. హైడ్రా తో ఆక్రమణలు తొలగించాలని ఆయన కఠిన నిర్ణయం వెనక అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. హైడ్రాపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినప్పటకీ హైడ్రాను మరింత బలోపేతం చేయడంపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ మంత్రి వర్గం ఆమోదం కల్పించడమే కాకుండా, ఇతర శాఖల మాదిరిగా హైడ్రాకు అన్ని అధికారాలుంటాయని తెలపడంతో ఇక దూకుడు మరింతగా హైడ్రా పెంచనుందని రేవంత్ రెడ్డి సిగ్నల్స్ ఇచ్చినట్లయింది.
అక్రమ నిర్మాణాలను
హైదరాబాద్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ అస్సెట్స్ ఏర్పాటుతో చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను ఇప్పటికే అనేకమైన వాటిని కూల్చివేసింది. అయితే ఇంకా వందకు పైగా ఫిర్యాదులు హైడ్రా వద్ద ఉన్నాయి. ముఖ్యమైన భవనాలను నిర్మించి అక్కడ వ్యాపారాలు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ఆసుపత్రులు కూడా నిర్వహిస్తుండటంతో వాటిని కూడా కూల్చాలని రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులను ఆదేశించారు. 169 మంది అదనపు సిబ్బందిని హైడ్రాకు కేటాయించడం వెనక కూడా రానున్న కాలంలో హైదరాబాద్ నగరంలో కూల్చివేతలు మరింతగా ఉంటాయాన్న సంకేతాలు పంపినట్లయింది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ ను తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అనేక కూల్చివేతలను చేపట్టి యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న హైడ్రా రానున్న కాలంలో మరింత స్పీడ్ పెంచే విధంగా అడుగులు వేయనున్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
న్యాయపరమైన చిక్కులను...
ఈ నేపథ్యంలో రాజకీయ నేతల ఆక్రమణలను కూల్చివేతలను త్వరలో ప్రారంభిస్తారని తెలిసింది. విద్యాసంస్థలను మాత్రం ఏ ఏడాది వేసవి సెలవుల్లో కూల్చివేతలను చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మధ్యలో అయితే విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడి విద్యాసంవత్సరం నష్టపోయే అవకాశముందని, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేక వస్తుందని భావించి కొంత వెనకడుగు వేసింది. ఈ లోపు న్యాయస్థానంలో వేసిన కేసుల విషయంలోనూ హైడ్రా కొంత సమాచారం ఇచ్చి క్లియర్ చేసుకోవాలని భావిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉండటంతో కొంత విరామమిచ్చిన హైడ్రా చట్టపరంగా అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు తొలగించేందుకు న్యాయనిపుణులతో హైడ్రా అధికారులు చర్చిస్తున్నారు.
Next Story