Fri Nov 22 2024 11:51:36 GMT+0000 (Coordinated Universal Time)
రాజా సింగ్ అసెంబ్లీలో అన్న మాటలు దేనికి సంకేతం?
రాజా సింగ్ అసెంబ్లీలో ఈ మాటలు అనడానికి కారణం.. ఆయన ఎమ్మెల్యేగా పోటీ
బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ ఆదివారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీకి తాను హాజరు కాలేనని చెప్పారు. జీరో అవర్‌లో రాజా సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడాది గడిచినా ఇంకా బీజేపీ సస్పెన్షన్‌ను రద్దు చేయకపోవడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల తర్వాత ప్రస్తుత అసెంబ్లీలో ఉన్నవారంతా సభకు హాజరు అవుతారో లేదో తనకు తెలియదని.. అయితే తాను మాత్రం హాజరు కాలేనని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నుంచి ఎవరు గెలుస్తారో తెలియదని.. తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందని అన్నారు రాజా సింగ్. తనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని.. నియోజకవర్గంలో పరిస్థితులు అన్నీ మారిపోయాయని చెప్పుకొచ్చారు. తన సొంత వారు, బయటి వారు తనను గెలవకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వాపోయారు. ప్రస్తుతం తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. సీఎం చంద్రశేఖర్‌రావుకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. తాను ఉన్నా లేకపోయినా తన గోషామహల్ నియోజకవర్గ ప్రజలపై దయ చూపాలని కోరారు. అక్కడి ప్రజలు సీఎం కేసీఆర్‌పై నమ్మకంతో కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం గోషామహల్ నియోజకవర్గాన్ని విస్మరించడం బాధాకరంగా ఉందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ధూల్‌పేటలో పర్యటిస్తానని, అక్కడి అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ తరువాత మర్చిపోయారని అన్నారు. అసెంబ్లీలో తాను ఉన్నా లేకపోయినా ధూల్‌పేటను అభివృద్ధి చేయాలని కోరారు.
రాజా సింగ్ అసెంబ్లీలో ఈ మాటలు అనడానికి కారణం.. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడమా.. లేక ఎంపీగా పోటీ చేయబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. రాజా సింగ్ భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు. బీజేపీని కాదని వేరే పార్టీలోకి వెళ్ళడానికి కూడా రాజా సింగ్ సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు రాజా సింగ్. అందుకే అసెంబ్లీలో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
Next Story