Mon Dec 23 2024 11:15:34 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఫలిస్తున్న రేవంత్ రెడ్డి వ్యూహం... జంట నగరాలపై పట్టు పెరుగుతోందా?
జంట నగరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ పై పట్టుపెంచుకోవడంలో సక్సెస్ అవుతున్నారు
ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టినా రాని ఇమేజ్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రజలు అభివృద్ధితో పాటు అక్రమాలను కూడా అదే స్థాయిలో ఆహ్వానిస్తారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వానికి కూడా అదే రకమైన ఇమేజ్ వస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ జంట నగరాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. రూరల్ ఏరియాలో బలం పెంచుకుని అధికారంలోకి రాగలిగినా, హైదరాబాద్ నగరంపై ఎంత మాత్రం గ్రిప్ సంపాదించుకోలేకపోయింది. నాయకత్వ లోపమా? గత ప్రభుత్వం జంట నగరాలలో చేసిన అభివృద్ధి కారణమా అని పక్కన పెడితే కాంగ్రెస్ కు మాత్రం హైదరాబాద్ లో ఇప్పటికీ నాయకత్వ లోపంతోనే ఉంది.
జంటనగరాలపై ఫోకస్...
జంట నగరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మెట్రో రైలును విస్తరించడంతో పాటు హైదరాబాద్ లో నాలుగో నగరానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఇటు ఐటీ సంస్థలను ఆహ్వానించడం, హైదరాబాద్ లో పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించడం ఇవన్నీ ఒక ఎత్తు. జంట నగర వాసుల గ్రిప్ ను మరింత సంపాదించుకోవాలంటే ఇది ఒక్కటే సరిపోదు. అందుకే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. దానికి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా వ్యవహరిస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాధ్ ను కమిషనర్ గా నియమించి ఫుల్లు పవర్స్ ఇచ్చారు.
ప్రజలు స్వాగతిస్తారని తెలిసే...
అక్రమ కట్టడాలు కూల్చివేతను ప్రజలు స్వాగతిస్తారని తెలుసు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రమే కాకుండా ఉద్యోగ వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తుందని ఆయన ఆశించారు. అయితే ఇదే కూల్చివేతలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కో, లేక హైదరాబాద్ మెట్రో డెవెలెప్మెంట్ అథారిటీకి అప్పగించే అవకాశముంది. కానీ ఆ రెండింటి నుంచి ముందుగానే కబ్జాదారులకు విషయం లీకవుతాయి. న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఎన్నాళ్ల నుంచో అవినీతికి పాల్పడిన ఆ రెండు సంస్థల్లో ఉద్యోగుల మీద రేవంత్ రెడ్డికి నమ్మకం లేకపోవడం వల్లనే హైడ్రాను ఏర్పాటు చేశారు.
హైడ్రా నెక్ట్స్ టార్గెట్...
హైదరాబాద్ లో ఒక్క హీరోలు మాత్రమే కాదు. ఎక్కువ మంది రాజకీయ నాయకులు, బిల్డర్లు ఎఫ్టీఎల్ నిబంధలనకు విరుద్ధంగా పెద్దయెత్తున నిర్మాణాలు చేపట్టారు. వీటిని కూల్చివేస్తే జంట నగరాల జనాలు జేజేలు కొట్టడం ఖాయం. అదే రేవంత్ రెడ్డి వ్యూహం. ఆ వ్యూహం వర్క్ అవుట్ అయింది. ఇప్పడు తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి అని ప్రచారం జరుగుతుంది. ఆయన చెరువులు,నాలాలు ఆక్రమించి యూనివర్సిటీ, కాలేజీలు, హాస్పిటల్ ను నిర్మించారు. ఇప్పటికే మల్లారెడ్డి ఆక్రమణలపై ఫిర్యాదు అందడంతో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అని అంటున్నారు. అలాగే మరో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదయింది. బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారాని ఆయనపై ఫిర్యాదు అందడంతో ఆయనపై కేసు నమోదయింది. ఇంకా లిస్ట్ లో చాలా మంది ఉన్నట్లే ప్రచారం జరుగుతుంది.
Next Story