Mon Nov 25 2024 21:23:35 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ నగరానికి ఏమైంది? అధిక జన సాంద్రత వల్లనే ఈ కష్టాలా? నరకయాతన
హైదరాబాద్ లో ఒకచోట నుంచి మరొకచోటకు ప్రయాణమంటే నరకాన్ని చవిచూడాల్సి వస్తుంది
హైదరాబాద్ నగరం అంటే అందరికీ ఇష్టమే. మంచి వాతావరణం. అన్ని మతాలు, కులాలు, రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. హైదరాబాద్కు వచ్చామంటే బతకడం పెద్ద కష్టం కాదు. పేదల నుంచి ధనవంతుల వరకూ అనువైన నగరంగా హైదరాబాద్ కు పేరుంది. 1990 దశకం నుంచి హైదరాబాద్ నగరానికి ప్రజల తాకిడి పెరిగింది. అప్పటి వరకూ పెద్దగా హైదారాబాద్ రాని వాళ్లంతా ఉపాధి అవకాశాల కోసం ఈ సిటీకి చేరి ఎక్కడో ఒక చోట బతుకీడుస్తున్నారు. తమ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కోటి జనాభా దాటి....
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పుడున్న హైదరాబాద్ నగరం విస్తీర్ణం మొత్తం 650 చదరపు కిలోమీటర్లుగా ఉంది. కానీ హైదరాబాద్ జనాభా ఇప్పటికే కోటి దాటింది. కోటి మందికి ఆశ్రయమిస్తున్న ఈ నగరంలో అన్ని రకాలు, వర్గాల వారికి అనువైన ప్రదేశంగా భావిస్తుంటారు. నెలకు ఐదు వేల రూపాయలు వచ్చే వారి నుంచి నెలకు ఐదు లక్షలు సంపాదించే వాళ్లు సయితం తమ స్టయిల్ లో బతికేందుకు అవసరమైన సిటీగా పేరుంది. పూరి గుడెసె నుంచి అధునాత భవంతుల్లో నివాసముంటున్న వారు ఇక్కడ ఉన్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ఆహారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అందుకే హైదరాబాద్ లో ఒకసారి ఉపాధి కోసం వచ్చిన వారు ఇక నగరాన్ని వదిలిపెట్టరనేది అంతే వాస్తవం.
అనేక మార్పులు జరిగినా...
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా వ్యవస్థను రూపొందించారు. మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు. ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి. కానీ నిత్యం ట్రాఫిక్ సమస్యలే. వర్షం పడినా.. పడకపోయినా.. ట్రాఫిక్ తిప్పలు మామూలు కావు. హైదరాబాద్ లో ఒకచోట నుంచి మరొకచోటకు ప్రయాణమంటే నరకాన్ని చవిచూడాల్సి వస్తుంది. రోడ్లు వెడల్పు చేసినా ఫలితం లేదు. ఫ్లే ఓవర్లు దాదాపు ఇరవై నుంచి ముప్ఫయి వరకూ ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో నిర్మించినా అంతే. గతంలో సోమవారం నుంచి శుక్రవారం వరకూ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు శని, ఆదివారాలు సెలవు దినాల్లో సయితం ట్రాఫిక్ సమస్య తలెత్తుతూనే ఉంది.
సరి - బేసి విధానం...
ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు తీసుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు పెడుతూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి సిబ్బంది పడుతున్న కష్టం మాత్రం సత్ఫలితాలనివ్వడం లేదు. ఇన్ని సదుపాయాలున్నా ఎక్కువ మంది ప్రజలుసొంత వాహనాలను రోడ్లపైకి తెస్తుండటంతోనే ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు. అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాన్ని కూడా ప్రజలు ఉపయోగ పడటం లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్ లో హైదరాబాద్ నగరంలో ప్రయాణం నరకంగా మారే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఢిల్లీ తరహాలోనే ట్రాఫిక్ ను నియంత్రించేందుక సరి - బేసి విధానాన్ని పాటిస్తే మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి. వర్షాకాలం హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేయకుండా వర్క్ ఫ్రం హోం చేసుకుంటే మంచిదన్న సలహాలు వినవస్తున్నాయి. లేకపోతే కిలోమీటరు ప్రయాణించాలంటే గంటపట్టే అవకాశముంది.
Next Story