Mon Apr 07 2025 02:34:21 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ నగరానికి పొంచి ఉన్నరెండు ప్రమాదాలు.. అవి వింటే?
హైదరాబాద్ నగరానికి రానున్న రోజుల్లో రెండు ముప్పులు పొంచి ఉన్నాయి.

హైదరాబాద్ నగరానికి రానున్న రోజుల్లో రెండు ముప్పులు పొంచి ఉన్నాయి. ఈ వేసవి కాలాన్ని హైదరాబాద్ ఎలా గట్టెక్కుతుందన్న దానిపైనే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వేసవి ఇంకా తీవ్రత కాకముందే అప్పుడే కరెంటు కోతలు మొదలయ్యాయి. నీటి కష్లాలు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ట్యాంకర్ల ద్వారా కొన్ని ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ వాసులు నీటిని తెప్పించుకోవడం ప్రారంభించారు. దీంతో హైదరాబాద్ నగరం ఈ వేసవిని తట్టుకుని ఎలా నిలబడుతుందా? అన్న దానిపై అనేకమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఈ రెండు సమస్యలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. కానీ ఈ ఏడాది ఎండల తీవ్రతను చూస్తుంటే ఈ రెండు సమస్యలు నగరాన్ని చుట్టుముడతాయన్న డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
మంచినీటి సరఫరా...
హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే రెండు కోట్ల మంది జానాభాకు పైగానే ఉన్నారు. దీనికి తోడు ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా రోజూ లక్షల్లోనే ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వారితో నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి హైదరాబాద్ నగరంలో తాగునీటిని సరఫరా చేయడం అంటే ఆషామాషీకాదు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో రోజు మార్చి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి రోజుకు 270 నుంచి మూడు వందల మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరం అవుతుంది. ఈ నీటిలో యాభై శాతం నాగార్జున సాగర్ ద్వారానే సరఫరా అవుతుంది. అయితే సాగర్ లో కూడా నీరు అడుగంటి పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంజీరా నీటిని కొంత మేరకు సరఫరా చేస్తున్నారు. కానీ రానున్నకాలంలో రోజు మార్చి రోజు కూడా ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చని జలమండలి అధికారులు చెబుతున్నారు.
విద్యుత్తు వాడకం...
మరొకవైపు హైదరాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తుంది. నగరం నలుమూలలా పెరిగిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయే వారుఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో ఏటా విద్యుత్తు వినియోగం పెరిగిపోతుంది. రెండేళ్ల క్రితం అంటే 2023లో విద్యుత్తు డిమాండ్ 2,917 మెగావాట్లు ఉంటే, 2024లో అది 3,218 మెగావాట్లకు పెరిగింది. ఏసీల వాడకం పెరిగింది. వేసవిలో అన్ని రకాలుగా విద్యుత్తు వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్తు పంపిణీ సంస్థలు కొనుగోలు చేసి సరఫరా చేయాల్సి వస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అనధికార కోతలు మొదలయ్యాయి. ఇక మార్చి నెల నుంచి విద్యుత్తు సరఫరాలో అంతరాయం, నీటి సరఫరా తక్కువగా ఉండటంతో హైదరాబాద్ వాసులకు చుక్కలు కనపడటం ఖాయంగా కనిపిస్తుంది.
Next Story