మార్నింగ్ వాక్‌లో విషాదం.. బైక్ ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
మృత్యువు కూడా ఆ ఇద్దరు స్నేహితురాళ్లు బంధాన్ని విడదీయలేకపోయింది.. వారి స్నేహాన్ని చూసి యమధర్మరాజుకే కన్ను కుట్టిందో ఏమో..
హైదరాబాద్: మృత్యువు కూడా ఆ ఇద్దరు స్నేహితురాళ్లు బంధాన్ని విడదీయలేకపోయింది.. వారి స్నేహాన్ని చూసి యమధర్మరాజుకే కన్ను కుట్టిందో ఏమో.. మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఇద్దరు స్నేహితురాళ్ళు మృత్యువాత పడిన ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచే సుకుంది. ఈ సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. రిసాల బజార్‌కు చెందిన రాధిక(48) అనే మహిళకు బొల్లారం కళాసిగూడ సాయి నగర్‌కి చెందిన పొలం బాలమణి యాదవ్(60) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లేవారు.
గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ బొల్లారంలోని కంటోన్మెంట్ బోర్డ్ పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్‌కి వెళ్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఇద్దరు స్నేహితురాళ్లు కలిసి మార్నింగ్ వాకింగ్‌కి బయలుదేరారు. మరికాసేపట్లో కంటోన్మెంట్ బోర్డు పార్కు లోపలికి చేరుకునే సమయంలోనే ఒక బైక్ మృత్యువు రూపంలో వచ్చి వారిని కబలించింది. ఉప్పల్‌కి చెందిన ఆదిత్య అనే యువకుడు స్పోర్ట్స్ బైక్ మీద శామీర్‌పేట్‌లో రేస్ ఆడడానికి సికింద్రాబాద్ నుండి శామీర్‌పేట్ వైపు అత్యంత వేగంగా వెళ్తూ కంటోన్మెంట్ బోర్డు వద్ద రాధిక, బాలమణి యాదవులను ఢీకొట్టాడు.
దీంతో వారిద్దరూ రోడ్డు మీద పడిపోవడంతో వారి తలలకు బలమైన గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన రాధిక అక్కడికక్కడే మరణించింది. బాలమణి 108 అంబులెన్స్‌లో చికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించారు. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇద్దరు స్నేహితురాళ్లు ఒకేరోజు మృతి చెందడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.