Mon Dec 23 2024 14:53:04 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : హైడ్రా కూల్చివేతలతో భయం.. భయం... మూసీ నది వెంట జనాలు ఎందుకు వెళ్లనంటున్నారు?
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతుున్నారు
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. మూసీ నది పరివాహక ప్రాంతం వెంట అనేక దశాబ్దాలుగా ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఇష్టపడటం లేదు. మూసీ నది ఉప్పొంగి తమ ఇళ్లలోకి నీరు వచ్చినప్పటికీ పరవాలేదు కానీ, అక్కడ తమ నివాసాలను ఖాళీ చేయడానికి అంగీకరించడం లేదు. ఇప్పుడు హైడ్రా రాజకీయరంగు పులుముకుంది. బీఆర్ఎస్ రంగంలోకి దిగి న్యాయపరమైన సలహాలతో పాటు సాయం చేయడానికి సిద్ధమవుతుంది. మూసీ నదీ పరివాహక ప్రాంత ప్రజలు అనేక మంది ఆందోళన చెందుతూ ఉద్యమానికి దిగుతున్నారు.
సుందరీకరణ చేయాలని...
మూసీ నదిని సుందరీకరణ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే అందుకు ఆక్రమణలు అడ్డంకిగా మారాయి. దాదాపు పదమూడు వేల కట్టడాలు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని తొలగించడానికి ఇప్పటికే హైడ్రా సిద్ధమయింది. ఇందుకోసం రెవెన్యూ అధికారులు ఇళ్లకు నోటీసులు అంటిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇస్తామని చెబుతుంది. బండ్లగూడ, నాగోల్ తదితర ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూంలను కేటాయిస్తామని చెబుతుంది. అయినా వారు మాత్రం తమ నివాసాన్ని విడిచిపెట్టి వెళ్లేంందుకు సిద్ధపడటం లేదు. తమ తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్నామని వారు చెబుతున్నారు.
అన్ని రకాల అనుమతులు...
తమకు అన్ని రకాల అనుమతులున్నాయని, ఇతరుల నుంచి కొనుగోలు చేశామని, తమ ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఇచ్చారని, రహదారి సౌకర్యం కల్పించారని, పన్నులు కూడా చెల్లిస్తున్నామని, నల్లాలు కూడా ఇచ్చారని అలాంటిది తమ ఇళ్లను కూలదోస్తే తాము ఎలా జీవనం కొనసాగిస్తామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయని, ఉన్న పళంగా కూల్చివేస్తే తమ గతేంటన్నది వారి ప్రశ్న. ప్రభుత్వం మాత్రం కూల్చివేతలకే సిద్ధమయింది. హైడ్రా ఈ కూల్చివేతల కోసం పద్దెనిమిది బుల్్డోజర్లను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మూసీ నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వారు ఆవేదనతో బతుకులు ఈడుస్తున్నారు.
నిజాం కాలం నుంచి...
డబుల్ బెడ్ రూం ఇళ్లను తామేం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. తమ స్థిర నివాసాలను కూలగొట్టి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తామంటే ఎందుకు ఒప్పుకుంటామని వారు ప్రశ్నిస్తున్నారు. నిజాం కాలం నుంచి తాము ఇక్కడే నివసిస్తున్నామని, ఒక్కో ఇంట్లో నాలుగైదు కుటుంబాలు జీవిస్తున్నాయని, రోజు వారీ పనుల కోసం నగరం మధ్యలో ఉన్న తమకు అందుబాటులో ఉన్నది కాదని డబుల్ బెడ్ రూం ఇళ్లు అవసరం లేదని చెబుతున్నారు. మరోవైపు అందరూ కలసి న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు రాజకీయ పార్టీల నుంచి మద్దతు తీసుకుంటూనే, మరొక వైపు న్యాయపరమైన సలహాలతో ముందుకు వెళ్లాలని వారు ఉన్నారు. మొత్తం మీద హైడ్రాకు మూసీ నది పరివాహక ప్రాంత కట్టడాల కూల్చివేత మాత్రం కత్తిమీద సామే అవుతుందని చెప్పాలి.
Next Story