Sat Nov 23 2024 00:01:24 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad: ట్యాంక్‌బండ్‌పై కోలాహలం...గణేశుడి నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభం
హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు వినాయక నిమజ్జనం జరుగుతుంది. శోభాయాత్ర ఇప్పటికే ప్రారంభమయింది.
హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు వినాయక నిమజ్జనం జరుగుతుంది. శోభాయాత్ర ఇప్పటికే ప్రారంభమయింది. దీంతో గణేశుడు వెళ్లే రూట్లు ముందుగానే పరిశీలించిన అధికారులు ట్యాంక్‌బండ్ వరకూ వన్ వే ను ఏర్పాటు చేశారు. చిన్న గణపతుల నుంచి భారీ గణనాధుల వరకూ ఈ శోభాయాత్రలో పాల్గొననున్నాయి. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనానికి నిర్వాహకులు తరలించారు. అందుకు తగిన ఏర్పాట్లను నిన్న రాత్రి నుంచే ప్రారంభించారు. జంట నగరాలలో మిగిలిన ప్రాంతాల నుంచి కూడా గణపతులు మరికాసేపట్లో బయలుదేరనున్నారు. ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు.
సొంత వాహనాలను..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మిగిలిన శాఖలతో సమన్వయంతో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. మొత్తం నగరంలో 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ ను తొలగించారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ పై ఆంక్షలను విధించారు. ఎవరూ సొంత వాహనాలను వినియోగించుకుని ట్యాంక్ బండ్ కు రావద్దని, ప్రజా రవాణా వ్యవస్థను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు కోరుతున్నారు. గణపతి విగ్రహాలు దాదాపు లక్ష వరకూ నేడు నిమజ్జనం కానుండటంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. బోలో జై గణేశ్ మహారాజ్‌కి జై అంటూ నినాదాలతో శోభాయాత్ర మొదలయింది.
భారీ బందోబస్తు...
అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 25 వేల మంది పోలీసులను ఈ శోభాయాత్ర కోసం వినియోగిస్తున్నారు. డేగ కళ్లతో పరిశీలించడానికి ఎక్కడకక్కడ సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నుంచి మానిటర్ చేస్తూ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తున్నారు. ట్యాంక్‌బండ్ తో పాటు సరూర్ నగర్ చెరువుతో సహా మొత్తం హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో ఈ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకూ నగరంలో ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ముందుగా బాలాపూర్ గణేశుడి విగ్రహం గ్రామ పురవీధుల్లో జరిగిన తర్వాత లడ్డూ వేలం పాట జరుగుతుంది. అనంతరం నిమజ్జనానికి బయలుదేరుతాడు. ఇందుకు తగిన ఏర్పాట్లను ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
Next Story