Fri Dec 27 2024 10:56:45 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో నీటి ఎద్దడి.. వామ్మో.. బెంగళూరుగా మారబోతుందా ఏంది?
హైదరాబాద్ లో నీటి కొరత ఏర్పడింది. నల్లాల నుంచి వచ్చే నీరు తగ్గిపోయాయి. జలాశయాలలో నీరు లేకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది
హైదరాబాద్ లో మంచినీటి కొరత ఏర్పడింది. నల్లాల నుంచి వచ్చే నీరు తగ్గిపోయాయి. జలాశయాలలో నీరు లేకపోవడంతో ఈ దుస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఎండలు మండిపోతుండటంతో పాటు నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో నీటి సరఫరాను సక్రమంగా చేయలేక జలమండలి అధికారులు చేతులెత్తేతస్ున్నారు. బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితికి నగరంలో అనేక చోట్ల వచ్చాయి. ముఖ్యంగా గేటెడ్ కమ్యునిటీలలో నివసించే వారు ట్యాంకర్లతో నీటిని తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నా అవి కూడా వెనువెంటనే దొరకని పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ లో గతంలో ఎన్నడూ లేనంత నీటి ఎద్దడి నేడు తలెత్తిందనే చెప్పాలి. భూగర్భ జలాలు అడుగింటిపోయాయి. బోర్లలో నుంచి నీళ్లు కూడా రావడం లేదు. ఇక రోజు విడిచి రోజు సరఫరా అయ్యే మంచినీటిని కూడా తగినంత విడుదల చేయకపోవడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే ఉన్నాం. ఇంకా మూడు నెలలు వర్షాలు ఉండవు. జూన్, జులైలలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకూ నీటి ఎద్దడిని తట్టుకునే దానిపై జలమండలి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి సరిపడా నీటిని తెచ్చేందుకు అవసరమైన మార్గాలను వెతుకుతున్నామని చెబుతున్నారు.
కోటి దాటడంతో...
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం జనాభా కోటి దాటింది. దీనికి తోడు ఫ్లోటింగ్ పాపులేషన్ మరో పదిలక్షలు ప్రతి రోజూ ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా జలాశయాల్లో నీరు ఎండిపోవడంతో ప్రజలు గొంతు తడుపుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం కావడంతో దాహం ఎక్కువవ్వడం, నీరు ఎక్కువగా వినియోగించాల్సి రావడంతో పాటు, ఉక్కపోతతో రోజుకు రెండుసార్లు స్నానాలు చేయడం వంటి వాటితో నీరు సరిపడా లభ్యం కావడం లేదన్నది యదార్థం. అపార్ట్మెంట్లలో ఇప్పటికే ట్యాంకర్లు తెచ్చుకోవడం ప్రారంభమయింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నంది హిల్స్, మణికొండ ప్రాంతాల్లో తాగు నీటి కోసం ట్యాంకర్లకు డిమాండ్ ఎక్కువయింది.
వర్షాభావ పరిస్థితులు...
కొందరు ఇండిపెండెంట్ ఇళ్లలో ఉన్నవారు కూడా చిన్న పాటి ట్యాంకర్లను తెప్పించుకునే పరిస్థితి తలెత్తింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాభావ పరిస్థితులు ఈ దుస్థితికి కారణమయ్యాయని అధికారులు చెబుతున్నారు. దీంతో మరోసారి ఇంకుడు గుంతలు తవ్వాలంటూ జలమండలితో పాటు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోరుతున్నారు. వర్షాలు పడేంతవరకూ ఈ నీటి ఎద్దడి నుంచి ఎలా బయటపడతామన్నది అర్థం కాకుండా ఉందని జలమండలి శాఖ అధికారులు చెబుతున్నారు. బెంగళూరులో తలెత్తిన నీటి ఎద్దడి తరహాలోనే హైదరాబాద్ కు కూడా రానున్న కాలంలో నీటి ఎద్దడి ముప్పు ముంచి ఉందన్నది అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్న మాట. సంకేతాలు కూడా అలాగే ఉన్నాయి. సో.. నీటిని వృధా చేయకండి... ప్రతి బొట్టును కాపాడుకుంటేనే.. మూడు నెలలు బతకేయగలం మరి.
Next Story