Mon Dec 23 2024 01:43:41 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : రియల్టర్లకు హైడ్రా గుడ్ న్యూస్.. కూల్చివేతల నుంచి వారికి మినహాయింపు
హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది
హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు కూడా కొంత వెనకంజ వేస్తున్నారు. ఇప్పటి వరకూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎక్కువగా ఫ్లాట్లను కొనుగోలు చేస్తూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలను కాపాడుతూ వస్తున్నారు. అందుకే హైదరాబాద్ లో ఇల్లు అంటే అతి ఖరీదుగా మారింది. ఇరవై ఏళ్ల క్రితం లక్షల్లో ఉండే డబుల్, ట్రిబుల్ బెడ్ రూంలు ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అయినా మొన్నటి వరకూ కొనుగోళ్లు ఆగడం లేదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ముఖ్యంగా తాము చెల్లించాల్సిన ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు...
దీంతో పాటు హైదరాబాద్ వంటి వాతావరణంలో స్థిరపడాలనుకునే వారు అనేక మంది ఎక్కువగా అపార్ట్మెంట్లవైపు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. ఎందుకంటే సొంత ఇంటి కంటే ఫ్లాట్ అయితే భద్రత ఉంటుందని నమ్మకంతో దీనిపైనే తమ డబ్బులు వెచ్చించడానికి సిద్ధపడతారు. రిటైర్ అయిన ఉద్యోగులు సయితం ఇండివిడ్యువల్ ఇంటి కంటే అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కొనుగోలుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అన్ని సౌకర్యాలు ఉండటంతో పాటు సెక్యూరిటీ పరంగానే కాకుండా, తమకు ఏ అవసరమొచ్చినా పెద్దగా జర్నీ చేయకుండానే అక్కడే కొనుగోలు చేసుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు ఉండటం కూడా ఒక కారణమని చెప్పక తప్పదు.
హైడ్రా ఏర్పాటుతో...
అలాంటి సమయంలో హైడ్రా ఏర్పాటు కావడం, దూకుడుగా వ్యవహరించడంతో పాటు విల్లాలు, అపార్ట్మెంట్లను కూల్చివేయడంతో కొనుగోళ్లు తగ్గాయి. అమ్మకాలు తగ్గడంతో రియల్టర్లు కూడా పెద్దయెత్తున నష్టపోయారు. అంతేకాదు తమ వెంచర్లను కూడా నిలిపివేశారు. తమ అపార్ట్మెంట్లు ఎఫ్టీఎల్, భపర్ జోన్ లో ఉందో? లేదో? తెలియక వారు నిర్మాణాలను నిలిపేశారు. ఈ ప్రభావం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే కాకుండా భవన నిర్మాణ రంగంపై కూడా పడిందని లెక్కలు చెబుతున్నాయి. హైడ్రా దెబ్బకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలయిందనే చెప్పాలి. హైదరాబాద్ కంటే ఇతర ప్రాంతాల్లో కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
హైడ్రా ప్రకటనతో...
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమయింది. హైడ్రా కూల్చివేతలలో కొన్ని మినహాయింపులను ఇచ్చింది. రియల్ ఎస్టేట్ కు భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకుంది. చట్టబద్ధమైన అనుమతులున్న వెంచర్లకు కూల్చివేతల నుంచి మినహాయింపు ఉంటుందని హైడ్రా ప్రకటించింది. వారు భయపడాల్సిన పనిలేదని తెలిపింది. చెరువుల వద్ద అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఆ వెంచర్లను కూల్చివేయమని ప్రకటించింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపింది. కావాలంటే తమను సంప్రదించవచ్చని కూడా పేర్కొంది. చెల్లుబాటయ్యే అనుమతులున్న నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లో కూల్చివేయమని హైడ్రా ప్రకటించడంతో ఇక హైదరాబాద్ లో రియల్ రంగం దూసుకు పోయే అవకాశముంది.
Next Story