Fri Nov 22 2024 17:10:06 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : హైడ్రాతో రేవంత్ కెలుక్కున్నారా? అందరూ వ్యతిరేకమవుతున్నారా?
హైడ్రా ఏర్పాటుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మందికి శత్రువుగా మారనున్నారు
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీక ఏర్పాటుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మందికి శత్రువుగా మారనున్నారు. కొన్నేళ్ల నుంచి నివాసముంటున్న ఇళ్లను, నిర్మాణాలను, కమర్షియల్ కాంప్లెక్స్ లను కూల్చివేస్తుండటంతో హైడ్రాను తెచ్చి లేనిపోని వివాదాన్ని తెచ్చుకున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎవరూ బయటపడకపోయినప్పటికీ ఆఫ్ ది రికార్డుగా హస్తం పార్టీ నేతలు ఈ చర్యలు పార్టీపై వ్యతిరేకతను కొని తెచ్చి పెడతాయని అంటున్నారు. అనవసరంగా వివాదాలను కొని తెచ్చుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి రకమైన చర్యలు పార్టీని దెబ్బతీస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
గత నెల రోజుల నుంచి...
చెరువులు, నాలాలు, కుంటలను ఆక్రమించుకుని నిర్మించిన భవనాలను కూల్చివేస్తుండటం హైదరాబాద్ లో కలకలం రేగింది. గత నెల రోజుల నుంచి హైడ్రా ఇదే పని మీద ఉంది. ధనికుల నుంచి సామాన్యుల వరకూ ఎవరినీ వదిలిపెట్టకుండా వారికి చెందిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నివాస భననాలను మాత్రమే కాదు. అపార్ట్ మెంట్లు, బహుళ అంతస్థుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లను కూడా వాటి నిర్మాణం అక్రమమని తేలితే వెంటనే కూల్చవేతలు ప్రారంభిస్తున్నారు. దీంతో బిల్డర్లు ఒకింత ఆందోళన చెందుతున్నారని, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కూల్చివేతల పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని పార్టీ నేతలే అంటున్నారు.
హై కమాండ్ కు ఫిర్యాదు...
దీనిపై కొందరు పార్టీ నేతలు కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే రేవంత్ రెడ్డి మాత్రం కేర్ చేయడం లేదు. హైడ్రా లక్ష్యమే వేరు. హైదరాబాద్ ను వరద నీటి నుంచి సంరక్షించుకోవాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. హైడ్రాను మరింతగా బలోపేతం చేయడమే కాకుండా దానిని చట్టబద్దం చేసే ప్రయత్నంలో కూడా ఆయన ఉన్నారు. కానీ హైడ్రా చర్యల వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఇబ్బందుల్లో పడుతుందని కొందరు నేతలు హెచ్చరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా తగ్గిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. రాజకీయ నేతలు, పార్టీలు కూడా హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నాయి.
రాజకీయంగా నష్టమేనంటూ...
ఇప్పటికే హైదరాబాద్ లో గత గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్కసీటు మాత్రమే వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో ఇలాంటి చర్యలు ఏంటన్నది జంటనగరాల కాంగ్రెస్ నేతలు నోటి నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అలాగయితే రేపు పోటీ చేయడానికి ఎవరు వస్తారని వాళ్లు సూటిగానే నిలదీస్తున్నట్లు తెలిసింది. ఈరోజు శనివారం కూడా హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. గగన్ పహాడ్ లో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అప్ప చెరువు ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను భారీ బందోబస్తుతో కూల్చివేతలను చేపట్టారు. మొత్తం మీద రేవంత్ మాత్రం తగ్గడం లేదు. పార్టీ నుంచి బడా బాబుల నుంచి వ్యతిరేకతను మాత్రం బాగానే మూటగట్టుకుంటున్నారు.
Next Story