Sat Dec 21 2024 04:55:40 GMT+0000 (Coordinated Universal Time)
మనకంటే ముందు పాకిస్తాన్ కు ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది..?
భారత కాలమానం పాకిస్తాన్ కాలమానం కంటే 30 నిమిషాల ముందు ఉంటుంది.
బ్రిటీషర్లు భారతదేశాన్ని 300 ఏళ్లకు పైగా పాలించి వెళుతూ వెళుతూ రెండుగా చీల్చి వెళ్లారు. దీంతో పాకిస్తాన్ అనే కొత్త దేశం పుట్టుకొచ్చింది. 1947వ సంవత్సరం ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి పూర్తిగా విముక్తి పొందింది. మన పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం తన స్వాతంత్ర దినోత్సవాన్ని భారత్ దేశానికి ఒక్కరోజు ముందు జరుపుకుంటూ వస్తోంది.
స్వాతంత్య్రం వచ్చే సమయానికి రెండు దేశాలు కలిసే ఉన్నా.. పాక్ మనకంటే ఒకరోజు ముందు వేడుకలు నిర్వహిస్తుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకు కారణం ఏమిటంటే..? బ్రిటిష్ భారత్ చివరి వైస్రాయ్, భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ పాకిస్తాన్ పరిపాలన అధికారాన్ని ముహమ్మద్ అలీ జిన్నాకు ఆగస్టు 14, 1947న కరాచీలో బదిలీ చేశారు. ఇండియా, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా మారే తేదీ ఆగస్టు 15 కాగా.. తమకు ఆగస్టు 14నే అధికార మార్పిడి జరిగినందున పాక్ ఆరోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా స్వీకరించింది. జూన్ 1948లో పాకిస్తాన్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇండియా కంటే ముందు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఆగస్టు 14నే పాక్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు.
భారత కాలమానం పాకిస్తాన్ కాలమానం కంటే 30 నిమిషాల ముందు ఉంటుంది. ఇండియా 1947, ఆగస్టు 14 అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు స్వతంత్ర దేశంగా అవతరించింది. కాలమానం ప్రకారం చూస్తే పాక్ లో అప్పుడు సమయంలో ఆగస్టు 14వ తేదీ రాత్రి 11.30 గంటలు అయింది. అందుకే పాక్ లో స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 14నే జరుపుకుంటారు.ఆగస్ట్ 14, 15, 1947 అర్ధరాత్రి రంజాన్ 27వ రోజుతో సమానంగా ఉందని వాదించారు. ఇది పవిత్ర మాసంలోని పవిత్రమైన రోజుగా వారు భావిస్తారు. అందువల్ల ఆగస్ట్ 14ను స్వాతంత్ర్య దినంగా తీసుకున్నారని కూడా అంటారు. ముస్లింల కోసం ప్రత్యేకమైన దేశం కావాలని అప్పట్లో కోరడంతోనే పాక్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే..! అయితే ఎంతో మంది ముస్లింలు అక్కడికి వెళ్లకుండా భారత్ లోనే ఉండాలని భావించారు. ఇక్కడే ఉంటున్నారు.
Next Story