వందేమాతరం ఉద్యమం.. దేశమంతా ఒక్కసారిగా..!
ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర ఛటర్జీ అగ్రగణ్యుడు.
బంకిం చంద్రచటర్జీ రచించిన వందేమాతర గీతం స్వాతంత్ర్య పోరాటంలో ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. వందేమాతర ఉద్యమం బెంగాల్‌కు పరిమితం కాకుండా దేశవ్యాప్తమైంది. మొదట్లో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మితవాదుల నేతృత్వంలో జరిగినా క్రమంగా అతివాద, తీవ్రవాద నాయకత్వానికి మరలింది. ఈ ఉద్యమాన్ని బెంగాల్ నుంచి దేశవాప్తంగా ప్రచారం చేయడంలో బిపిన్ చంద్రపాల్ ప్రముఖ పాత్ర పోషించారు. మద్రాస్, ఆంధ్ర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ ఉద్యమ కాలంలోనే ట్యుటికోరిన్ (మద్రాస్)లో స్వదేశీ స్టీమ్ నేవిగేషన్ కంపెనీని స్థాపించారు. అక్కడ ఈ ఉద్యమాన్ని సుబ్రమణ్య అయ్యర్, చిదంబర పిైళ్లె విస్తృతం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు నేతృత్వం వహించారు. పంజాబ్‌లో భగత్‌సింగ్ మేనమామ అజిత్ సింగ్ అంజుమాన్ మెహబత్ వాటన్ అనే సంస్థను, భారతమాత అనే పత్రికను నడిపి ఉద్యమాన్ని విస్తరించారు.