Mon Dec 23 2024 08:07:26 GMT+0000 (Coordinated Universal Time)
మొన్న స్కూళ్లపై .. ఇప్పుడు మసీదులపై దాడులు, 33 మంది మృతి
తాజాగా మరోసారి ఆఫ్ఘనిస్థాన్ లో బాంబు పేలుడు సంభవించింది. కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదు బాంబు దాడులతో దద్దరిల్లింది.
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుండి తీవ్రవాద దాడులు చాలా ఎక్కువయ్యాయి. ముస్లింలలోనే ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని ఆత్మాహుతి దాడులు చోటు చేసుకుంటూ ఉన్నాయి.. స్కూళ్లలో కూడా బాంబ్ బ్లాస్ట్ లు.. ఇలా ఒక లిమిట్ అంటూ లేకుండా ఆఫ్ఘనిస్థాన్ రక్తసిక్తం అవుతూనే ఉంది. ఆ దేశంలో అందుబాటులో ఉండే ఆయుధాలు, లా అండ్ ఆర్డర్ లో ఉండే లోపాల కారణంగా తీవ్రవాదులు హాయిగా తిరుగుతూ ఉన్నారు.
తాజాగా మరోసారి ఆఫ్ఘనిస్థాన్ లో బాంబు పేలుడు సంభవించింది. కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇమామ్ సాహిబ్ జిల్లాలోని మవ్లావీ సికందర్ మసీదుపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించారు. 43 మంది గాయయపడ్డారు. మృతి చెందినవారిలో పిల్లలు కూడా ఉన్నారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ ఘాతుకాన్ని తాము ఖండిస్తున్నామని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది ఐసిస్ పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ లోని షియా, సూఫీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే ఉంది ఐసిస్. ఇప్పుడు దాడి జరిగిన మసీదు కూడా సూఫీ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతానికి చెందినది. "ప్రస్తుతం మా వద్ద పేలుడు గురించి లేదా ప్రాణనష్టం గురించి ఎటువంటి వివరాలు లేవు" అని ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి ఒబైదుల్లా అబేది చెప్పారు.
ఇమామ్ సాహిబ్లోని ముల్లా సికందర్ మసీదులో శుక్రవారం మధ్యాహ్నం దాదాపు 2:30 గంటలకు పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షి మీడియాతో తెలిపారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన కొద్దిసేపటికే.. ప్రత్యేక మతపరమైన ఆచారం అయిన జికర్ను ఆచరిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. భవనం కూడా పేలుడు ధాటికి తీవ్రంగా దెబ్బతింది. పేలుడు ధాటికి మసీదుకు ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. కుందూజ్ పేలుడు జరిగిన కొన్ని గంటల తర్వాత వచ్చిన రోడ్డు పక్కన బాంబు పేలుడులో దేశ రాజధాని కాబూల్లో ఒకరు గాయపడ్డారని భద్రతా వర్గాలు తెలిపాయి.
Next Story