Mon Dec 23 2024 06:44:47 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లిన ఆప్ఘాన్.. 9 మంది మృతి
మినీబస్సుల్లో రెండు బాంబు పేలుళ్లు సంభవించినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబులు
ఆఫ్ఘనిస్తాన్ : తాలిబన్ పాలిత దేశం ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. రెండు బాంబులు పేలిన ఘటనలో మొత్తం 9 మంది మరణించినట్లు అక్కడి పోలీసు ప్రతినిధి వెల్లడించారు. మజార్-ఇ-షరీఫ్‌లో గురువారం మినీబస్సుల్లో రెండు బాంబు పేలుళ్లు సంభవించినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబులు పేలాయి. రంజాన్ సందర్భంగా ప్రయాణికులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి.. విరమించేందుకు ఇంటికి వెళ్తుండగా ఈ బాంబు పేలుళ్లు జరిగినట్లు బల్ఖ్ ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి ఆసిఫ్ వజిరి తెలిపారు. ఈ పేలుళ్ల ఘటనల్లో 9 మంది మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజా ఘటనతో తాలిబన్ బలగాలు అప్రమత్తమయ్యాయి. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని తాలిబన్ అధికారులు తెలిపారు. తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్ఐఎస్ తెలిపింది. కుందుజ్‌లో, కాబూల్ పాఠశాలలో జరిగిన బాంబు దాడికి ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. గత వారమే మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే. షియాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
Next Story