Fri Nov 08 2024 21:16:01 GMT+0000 (Coordinated Universal Time)
58 అడుగుల బ్రిడ్జ్ ను ఎత్తుకుపోయిన దొంగలు
ఒహియాలోని స్మాల్ అక్రాన్ ప్రాంతంలో ఓ కాలువపై నిర్మించిన 58 అడుగుల పొడవైన ఫుట్ బ్రిడ్జి రాత్రికి రాత్రే మాయమయింది.
ఎక్కడైనా దొంగలు డబ్బులు, నగలు, ఇతర విలువైన వస్తువులను దోచుకుపోతారు. మరీ కొంటెదొంగలైతే ఇంట్లో ఉన్న అన్నం, కూరలని కూడా వదలరు. కానీ.. ఒహియాలో దొంగలు ఏం దొంగిలించారో.. ఎలా దొంగిలించారో తెలిస్తే ఖచ్చితంగా షాకవుతారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 58 అడుగుల పొడవైన భారీ వంతెనను ఎత్తుకుపోయారు. ఇది తెలిసిన పోలీసులు.. అంత పెద్ద బ్రిడ్జిని ఎలా ఎత్తుకెళ్లారంటూ ఖంగుతిన్నారు. ఇన్నాళ్ల మా సర్వీసులో ఇలాంటి దొంగతనం ఎక్కడా చూడలేదంటున్నారంట పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. ఒహియాలోని స్మాల్ అక్రాన్ ప్రాంతంలో ఓ కాలువపై పాలీమర్‌తో నిర్మించిన 58 అడుగుల పొడవైన ఫుట్ బ్రిడ్జి రాత్రికి రాత్రే మాయమయింది.
దొంగలెత్తుకు పోవడమేంటి?
వరదలు వచ్చి కొట్టుకుపోయిందనుకుంటే పొరపాటే. ఈ మధ్యకాలంలో అక్కడ అంత భారీ వర్షాలు కురవలేదు. నవంబరు 3న ఆ వంతెనకు ఉన్న డెక్‌ను కనిపించకపోవటంతో ఆ సమీపంలోని గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఏంటీ వంతెన కనిపించకపోవటమేంటీ అంటూ పలువురు గ్రామస్తులు అక్కడకు వచ్చి పరిశీలించారు. కానీ వంతెన జాడే లేదు. గత వారం రోజుల క్రితం ఉన్న వంతెన ఉన్నట్లుండి మాయమయ్యేసరికి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థులు చెప్పినమాటలు విన్న పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఏంటీ బ్రిడ్జ్ కనిపించట్లేదా? అని మరోసారి అడిగారు. మళ్లీ గ్రామస్తులు అదే మాట చెప్పటంతో ఘటనాస్థలానికి వచ్చి చూశారు. నిజమే ఫుట్ బ్రిడ్జ్ ఉన్న ఆనవాళ్లు ఉన్నాయి గానీ వంతెన మాత్రం లేదు. భారీ క్రేన్లతో నిర్మించిన వంతెన మాయం కావటంతో పోలీసులు షాక్ అయ్యారు.
ఎలా తీసుకెళ్లారబ్బా?
10 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు, 58 అడుగుల పొడవు ఉండే ఆ వంతెన తొలగించాలంటే.. భారీ క్రేన్లు అవసరమవుతాయి. అటువంటిది దొంగలు గుట్టుచప్పుడు కాకుండా.. కనీసం గట్టిగా కేక వేస్తే గ్రామస్తుల ఇళ్లలోకి వినిపించేంత దూరంలో ఉన్న గ్రామస్తులకు కూడా అనుమానం రాకుండా ఆ వంతెనను ఎలా దొంగిలించారన్న అనుమానం పోలీసులకు పిచ్చెక్కిస్తోంది. ఆ వంతెన విలువ సుమారు 40 వేల డాలర్లు (రూ.30.44 లక్షలు) ఉంటుందని తెలిపారు. కానీ.. దానిని అమ్మితే పైసా కూడా రాదు. ఎందుకంటే అది పాలిమర్ తో తయారు చేసిన వంతెన. రీసైక్లింగ్ చేసి మళ్లీ ఉపయోగించడం కూడా సాధ్యం కాదు. అంత భారీ బ్రిడ్జ్ ని అత్యంత లాఘవంగా ఎత్తుకుపోయిన దొంగలకు ఈ విషయం తెలుసో లేదో..మరి తెలిసే ఎత్తుకుపోయారా? తెలిస్తే చేస్తే ఏం చేసుకుంటారు? అనేది పెద్ద ప్రశ్న..మరి ఈ చోరీ కేసు ఛేదించాక అసలు విషయం తేలనుంది.
Next Story