Mon Dec 23 2024 17:23:51 GMT+0000 (Coordinated Universal Time)
మసీదులో భారీ ఉగ్రదాడి.. 18 మంది మృతి
తాలిబన్ ముఖ్యనేత, ఆప్ఘనిస్తాన్ డిప్యూటీ ప్రధాని ముల్లా బరాదర్ టార్గెట్ గా ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్లు తెలుస్తోంది.
తాలిబన్ల పాలిత దేశమైన ఆప్ఘనిస్థాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. మసీదుపై జరిగిన భారీ ఉగ్రదాడిలో ఆప్ఘనిస్తాన్ నెత్తురోడింది. తాలిబన్ నాయకులు, తాలిబన్ మద్దతు మతగురువు లక్ష్యంగా మసీదులో భారీ ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. పశ్చిమ ఆప్ఘనిస్తాన్ హెరాత్ నగరంలోని గుజార్గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఉగ్రదాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తాలిబన్ ముఖ్యనేత, ఆప్ఘనిస్తాన్ డిప్యూటీ ప్రధాని ముల్లా బరాదర్ టార్గెట్ గా ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో తాలిబన్ నాయకులతో సంబంధమున్న ప్రముఖ మతగురువు ముజీబ్ ఉల్ రెహమాన్ అన్సారీ మరణించారు. పేలుడు సమయంలో మసీదులోనే ఉన్న ముల్లా బారాదర్ గురించిన వివరాలు తెలియలేదు. ఆయనకు సంబంధించిన వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. ఈ ఉగ్రదాడిపై ఐసిస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇది ఆ సంస్థ పనేనని తాలిబన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story