Mon Dec 23 2024 15:54:38 GMT+0000 (Coordinated Universal Time)
యువకుడి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్
సాధారణంగా అతను ఇలాంటివి పట్టించుకోడు. కానీ రాత్రంతా అలర్ట్ మెసేజ్ లు, సాయంత్రం వేళ ఇబ్బందిగా అనిపించడంతో..
ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ గుండెపోటు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. యాపిల్ వాచ్ ఓ యువకుడి ప్రాణం కాపాడింది. వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ కు చెందిన ఆ యువకుడి పేరు ఆడమ్ క్రాఫ్ట్. వయసు 36 సంవత్సరాలు. ఇటీవల ఓ రోజు సాయంత్రం సోఫాలోంచి లేవగానే అతడికి తల తిరిగినట్టు అనిపించింది. దీంతో.. అతడు వంటగదిలోకి వెళ్లి మంచినీళ్లు తాగుతుండంగా కొంత ఇబ్బందికి గురయ్యాడు. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.
రాత్రికి మామూలుగానే నిద్రపోయాడు. ఉదయాన్నే లేచి చూసేసరికి తన చేతికున్న యాపిల్ వాచ్ లో పలు అలర్ట్ మెసేజ్ లు కనిపించాయి. సాధారణంగా అతను ఇలాంటివి పట్టించుకోడు. కానీ రాత్రంతా అలర్ట్ మెసేజ్ లు, సాయంత్రం వేళ ఇబ్బందిగా అనిపించడంతో.. వైద్యులను సంప్రదించాడు. అతడికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆ యాపిల్ వాచ్ సందేశాలు నిజమేనని ధృవీకరించారు. అతడు ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్తో బాధపడుతున్నట్టు చెప్పారు. గుండెకొట్టుకునే తీరులో లోపం తలెత్తడాన్ని ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్ అంటారు.
ఈ వ్యాధి ఉన్నవారు పైకి ఎలాంటి రోగాలు లేనట్టే ఉంటారు కానీ.. గుండెపనితీరు దెబ్బతింటుంది. తొలిదశలోనే ఈ వ్యాధిని గుర్తించడం కాస్త కష్టమే. సరైన సమయానికి చికిత్స అందకపోతే.. చివరకు గుండెపోటుకు దారి తీసేప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఇదంతా విని క్రాఫ్ట్ షాకయ్యాడు. యాపిల్ వాచ్ తన ప్రాణాన్ని కాపాడిందని స్థానిక మీడియాతో తన అనుభవాన్ని చెప్పాడు ఆడమ్ క్రాఫ్ట్.
Next Story