Mon Dec 15 2025 00:11:47 GMT+0000 (Coordinated Universal Time)
ముంచెత్తిన వరదలు.. 5గురు మృతి, 28 మంది గల్లంతు
గల్లంతైన వారికోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చైన్ పుర్, పంచఖపన్ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి..

కొద్దిరోజులుగా హిమాలయ దేశమైన నేపాల్ ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఫలితంగా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకూ వరదల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు నేపాల్ లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. చైన్ పుర్ మున్సిపాలిటీ-4 ప్రాంతంలో హేవా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సూపర్ హేవా హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద వరదలు సంభవించి అక్కడ పనిచేసే కార్మికులు గల్లంతయ్యారు.
గల్లంతైన వారికోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చైన్ పుర్, పంచఖపన్ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి హేవా నది ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. గత బుధవారం దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించగా.. రానున్న రోజుల్లో నేపాల్ లో భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు అంచనా వేశారు. నదుల్లో నీటిమట్టం పెరుగుతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరదల్లో చిక్కుకుని ఐదుగురు మృతి చెందడంపై ఆ దేశ ప్రధాని పుష్ప కుమార్ దహల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Next Story

