Sun Dec 22 2024 10:14:22 GMT+0000 (Coordinated Universal Time)
Bangladesh : రిజర్వేషన్లు అక్కడ కొంప ముంచాయ్... ఆందోళనకారుల దెబ్బకు ప్రధాని రాజీనామా చేశారుగా?
దేశంలో ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైనా ప్రభుత్వాలు తీసుకుంటే ప్రజలు తిరగడతారనడానికి అతి పెద్ద ఉదాహరణ బంగ్లాదేశ్
దేశంలో ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైనా ప్రభుత్వాలు తీసుకుంటే ప్రజలు తిరగడతారనడానికి అతి పెద్ద ఉదాహరణ బంగ్లాదేశ్. రిజర్వేషన్లు ప్రధాని షేక్ హసీనా పదవకిి ఎసరు తెచ్చాయి. చివరకు ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల శ్రీలంకలో ఆర్థిక మాంద్యం కారణంగా ప్రజలు తిరగబడి ప్రధాని నివాసంలోకి చొరబడి అక్కడ బీభత్సం సృష్టించిన సంగతిని చూశాం. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ లోనూ షేక్ హసీనా నివాసం ఉండే భవనంలోకి ఆందోళనకారులు చొరబడి అందిన కాడికి వస్తువులను దోచుకెళ్లారు. సైన్యం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించారు.
రిజర్వేషన్ల వివాదం ఏంటంటే?
బంగ్లాదేశ్ లో అసలు రిజర్వేషన్ల వివాదం ఎందుకొచ్చిదంటే? 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబీకులకు ప్రభుత్వం 30 శాతం రిజర్వేషన్లు కల్పించింది. కొన్నేళ్లుగా ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనలకు దిగింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లను ఐదు శాతానికి తగ్గించాలని సుప్రీం ఆదేశించింది. 93 శాతం ప్రతిభ ఆధారంగా, రెండు శాతం మైనార్టీలు, దివ్యాంగులకు కేటాయించాలని తెలిపింది. అయితే పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆందో ళనకారుల డిమాండ్ గా వినిపిస్తుంది. ఇదే అతి పెద్ద ఆందోళనగా మారింది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు దిగారు.
ప్రధాని నివాసం ముట్టడి...
నిన్న జరిగిన హింసలో వంద మంది వరకూ మరణించగా, దేశంలోని అనేక ప్రాంతాలకు ఘర్షణలు పాకాయి. ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలంటూ నిరసనకారులు రోడ్లెక్కారు. కాగా, అధికారిక నివాసాన్ని వీడేముందు ప్రధాని షేక్ హసీనా ఓ సందేశాన్ని రికార్డు చేయాలని భావించినా, ఆందోళనకారుల ముట్టడితో అది సాధ్యం కాలేదు.కర్ఫ్యూ విధించినప్పటికీ లెక్కచేయకుండా ఈరోజు వేలామంది నిరసనకారులు ఢాకా వీధుల్లో కవాతు చేస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. సైన్యం, పోలీసులు బారికేడ్లు, ముళ్లకంచెలు అడ్డుగా పెట్టినప్పటికీ, భారీ సంఖ్యలో తరలివచ్చిన నిరసనకారులు వాటిని తొలగించుకుని షేక్ హసీనా ఇంట్లోకి చొరబడ్డారు.
భారత్ వచ్చి....
ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆమె భారత్ వచ్చినట్లు తెలిసింది. భారత్ లోని త్రిపురకు ఆమె చేరుకున్నారు. త్రిపురలోని అగర్తలో ఉండి ఇక్కడి నుంచి లండన్ వెళ్లేందుకు ఆమె ప్లాన్ చేసుకున్నారని చెబుతున్నారు. దీంతో సైన్యం అక్కడ ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కర్ఫ్యూ కొనసాగుతుందని ఆర్మీ చీఫ్ ప్రకటించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని, ప్రజలు శాంతియుతంగా మెలగాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని ఆర్మీ చీఫ్ కోరారు. మొత్తం మీద బంగ్లాదేశ్ జరిగిన అల్లర్లలో 100 మందికి పైగా చనిపోగా మొత్తంగా 300 మందికి మృతి చెందారు. మరో వైపు భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఇండియా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.
Next Story