Sun Dec 22 2024 10:56:28 GMT+0000 (Coordinated Universal Time)
China New Virus: చైనాలో పుట్టుకొచ్చిన కొత్త వైరస్
చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది
చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఈ వార్త వింటే చాలు ప్రపంచమంతా టెన్షన్ పడుతుంది. వెట్‌ల్యాండ్ వైరస్ (WELV) అనే కొత్త వైరస్ చైనాలో బయట పడడంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. టిక్స్ కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుందని వైద్యులు తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తులకు నాడీ సంబంధిత సమస్యలే కాకుండా, తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు. ఇన్నర్ మంగోలియాలోని చిత్తడి నేల ప్రాంతంలో టిక్ కాటుకు గురైన తర్వాత జ్వరం, తలనొప్పి, వాంతులతో జిన్‌జౌ నగరానికి చెందిన 61 ఏళ్ల వ్యక్తి బాధపడ్డాడు. అతడిలో 2019 లో ఈ వైరస్ మొదటిసారిగా గుర్తించారు.
యాంటీబయాటిక్స్‌తో అతడికి చికిత్స అందించాలని చూసినప్పటికీ ఎలాంటి ప్రయత్నం ఫలించలేదు. ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల కాకుండా వైరల్‌గా ఉంది. అతని రక్తంలో ఆర్థోనైరోవైరస్, క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్ల కుటుంబం ఉందని గుర్తించారు. 'ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, వెట్‌ల్యాండ్ వైరస్ చైనాలోని 17 మంది రోగులకు సంక్రమించింది. సాధారణ లక్షణాలు జ్వరం, తల తిరగడం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, అలసట అని తెలిపారు. ఒక రోగి అయితే ఏకంగా కోమాలోకి వెళ్లాడని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో వైరస్ చాలా ప్రమాదకరమైనదని పరిశోధకులు హెచ్చరించారు. అయితే బాధిత రోగులందరూ వైద్య చికిత్స పొందిన తర్వాత కోలుకున్నారని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Next Story