Fri Nov 22 2024 23:40:29 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్దేశపూర్వకంగానే కరోనా సృష్టి.. తేల్చేసిన వుహాన్ సైంటిస్ట్
తమ పై అధికారి ఒకరు తమకు నాలుగు రకాల కరోనా వైరస్ లను ఇచ్చి వాటిలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే దానిని గుర్తించాలని..
ప్రపంచమంతా కరోనా వైరస్ ధాటికి అల్లాడిపోడానికి కారణం చైనానే అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కరోనా పేరు చెబితే వణికిపోతున్నారు ప్రజలు. కానీ.. ఇది సహజంగా పుట్టిందా ? లేక కావాలని తయారు చేసి బయటికి పంపారా ? అన్న సందేహాలు ఇంకా నివృత్తి కాలేదు. కొందరు సహజంగా వచ్చిందంటే.. కొందరు మాత్రం మానవ సృష్టి అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వుహాన్ శాస్త్రవేత్త కరోనా పుట్టుకపై చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ లోనే పురుడు పోసుకుందని వైరాలజీ ఇనిస్టిట్యూట్ పరిశోధకుడు చావోషావ్ వెల్లడించాడు.
ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు, హక్కుల కార్యకర్త జెన్నిఫర్ ఝెంగ్కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చావోషావ్ ఈ విషయాన్ని చెప్పాడు. తమ పై అధికారి ఒకరు తమకు నాలుగు రకాల కరోనా వైరస్ లను ఇచ్చి వాటిలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే దానిని గుర్తించాలని ఆదేశించారని తెలిపాడు. 2019లో వుహాన్లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్ సమయంలో తమ సహచరులు చాలామంది అదృశ్యమయ్యారన్న షావో.. క్రీడాకారులు బస చేసిన హోటళ్లలో వారి ఆరోగ్యం, అక్కడి పరిశుభ్రతను చెక్ చేసేందుకు వారిని పంపినట్లుగా తర్వాత తెలిసిందన్నారు. కరోనా వైరస్ జీవాయుధమని, దానిని ఉద్దేశపూర్వకంగానే సృష్టించినట్లు తేల్చేశారు.
నిజానికి మిలిటరీ వరల్డ్ గేమ్స్ సమయంలో చెకింగ్ కు వెళ్లేందుకు వైద్యులు సరిపోతారు. కానీ.. వైరాలజిస్టులను పంపినపుడే తనకు అనుమానం వచ్చిందన్నారు. వైరస్ ను వ్యాప్తి చేసేందుకే పంపి ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత ఏడాది జింగ్జియాంగ్లోని రీ ఎడ్యుకేషన్ శిబిరాల్లో ఉన్న వుయిగర్ల ఆరోగ్యాన్ని పరీక్షించాలంటూ వైరాలజిస్టులను పంపడంతో తన అనుమానం మరింత బలపడిందన్నారు. వైరస్ ను వ్యాపింపజేయడం లేదా మానవులపై వైరస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకే పంపి ఉంటారని షావో అభిప్రాయపడ్డారు. షావో చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Next Story