Tue Dec 24 2024 17:40:00 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా ఫోర్త్ వేవ్.. 5 రెట్లు పెరిగిన ఒమిక్రాన్ కేసులు
దక్షిణాఫ్రికాలో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైంది. ఒమిక్రాన్ గా పిలవబడుతున్న కరోనా కొత్త వేరియంట్ అక్కడే మొదలైంది
దక్షిణాఫ్రికాలో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైంది. ఒమిక్రాన్ గా పిలవబడుతున్న కరోనా కొత్త వేరియంట్ అక్కడే మొదలైందన్న విషయం తెలిసిందే. ఒమిక్రాన్ భయంతో అక్కడున్న ఇతర దేశాల వాసులు స్వదేశాలకు వెళ్తుండటంతో.. ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. అక్కడి నుంచి స్వదేశాలకు వస్తున్న వారిలో చాలా మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్థారణ అవుతుండటం.. ఏం చేయాలో, ఒమిక్రాన్ ను ఎలా కట్టడి చేయాలో తెలియక చాలా దేశాలు వణికిపోతున్నారు. ఇప్పటికే ఈ కొత్తరకం వేరియంట్ 43 దేశాలకు విస్తరించిందంటే.. ఈ వేరియంటే ఎంత వేగంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రోజూ పది వేల కేసులకు....
అయితే.. దక్షిణాఫ్రికాలో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వారాల క్రితం అక్కడ కోవిడ్ పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా.. ఇప్పుడది అమాంతం 25 శాతానికి పెరిగింది. రోజువారీ కేసులు 10 వేలకు పైగా నమోదవుతుండటంతో దక్షిణాఫ్రికా వాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఓ వైపు ఒమిక్రాన్, మరోవైపు సాధారణ కరోనా కేసులతో సఫారీ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ పరిస్థితిపై ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా మాట్లాడుతూ.. మరికొన్ని వారాల్లో ఈ వైరస్ వ్యాప్తి రేటు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారని తెలిపారు. ప్రస్తుతం తాము వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.
Next Story