Mon Dec 23 2024 07:53:30 GMT+0000 (Coordinated Universal Time)
తల్లిగర్భంలో ఉన్న ఇద్దరు చిన్నారులకు సోకిన కోవిడ్..దెబ్బతిన్న మెదడు
2020లో డెల్టా వేరియంట్ విజృంభించి.. కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి ముందే ఈ ఘటన జరిగిందని అమెరికా వైద్యులు
2019లో చైనాలో పుట్టి.. యావత్ ప్రపంచాన్ని రెండేళ్లు గడగడలాడించిన కోవిడ్.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా కోవిడ్ కేసులకు సంబంధించి విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. తల్లిగర్భంలో ఉన్న ఇద్దరు చిన్నారులకు కరోనా సోకి.. వారి మెదడు దెబ్బతిన్నట్లు బయటపడింది. అయితే ఇలాంటి కేసులు బయటపడటం ఇదే తొలిసారి అని అమెరికా వైద్యులు తెలిపారు. మియామీ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైన ఈ విషయం పై ‘పీడియాట్రిక్స్ జర్నల్’లో ఓ కథనం ప్రచురితమైంది.
2020లో డెల్టా వేరియంట్ విజృంభించి.. కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి ముందే ఈ ఘటన జరిగిందని అమెరికా వైద్యులు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్గా తేలిన ఇద్దరు తల్లులకు ఇద్దరు శిశువులు పుట్టగా.. పుట్టినరోజునే వారిద్దరూ మూర్చవ్యాధికి గురయ్యారు. ఆ తర్వాత శిశువుల్లో ఎదుగుదల కూడా తగ్గింది. 13 నెలల వయసులో ఓ చిన్నారి చనిపోగా.. మరో చిన్నారిని వెంటనే హాస్పైస్ కేర్ కు తరలించి చికిత్స అందించారు. శిశువులకు కోవిడ్ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ కాలేదు కానీ.. వారి రక్తంలో మాత్రం కోవిడ్ నమూనాలు అధిక స్థాయిలో ఉన్నట్టు గుర్తించామని మియామి యూనివర్సిటీ నియోనాటాలజిస్ట్, పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మెర్లైన్ బెన్నీ తెలిపారు.
తల్లికి కోవిడ్ సోకగా.. అది క్రమంలో గర్భంలోని మాయకు ఆ తర్వాత గర్భస్థ శిశువుకు చేరినట్లు భావిస్తున్నామన్నారు. ఆ ఇద్దరు శిశువుల తల్లుల మాయల్లో వైరస్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే మృతి చెందిన శిశువుల మెదడు శవపరీక్షలో మెదడులో వైరస్ జాడలు కూడా కనిపించాయని, ఈ ఇన్ఫెక్షన్ నేరుగా మెదడుపై ప్రభావం చూపిందని డాక్టర్ బెన్నీ వివరించారు. ఇప్పటికైనా గర్భిణీ స్త్రీలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.
Next Story