Mon Dec 23 2024 12:25:36 GMT+0000 (Coordinated Universal Time)
డేంజర్ బెల్స్ .. భారత్ లో రోజుకు 14 లక్షల కేసులు ?
11రాష్ట్రాల్లో వ్యాపించిన ఒమిక్రాన్ దేశమంతా వ్యాపించేందుకు ఎక్కువసమయం పట్టకపోవచ్చునని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్
ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్. యూకే, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లోనే కాదు.. ఇప్పుడు ఇండియాలోనూ ఒమిక్రాన్ వేగం పెంచింది. రోజులు గడిచేకొద్ది దేశంలో పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే 11 రాష్ట్రాల్లో పాగా వేసిన ఒమిక్రాన్.. దేశమంతా వ్యాపించేందుకు ఎక్కువసమయం పట్టకపోవచ్చునని నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. యూకే, ఫ్రాన్స్ దేశాల్లో పరిస్థితే భారత్ లోనూ వస్తే.. రోజుకు 14 లక్షల పాజిటివ్ కేసులు నమోదవ్వచ్చనని తెలిపారు.
రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్
యూకేలో ఇప్పటికే వేల కేసులు నమోదవ్వగా.. అదే పరిస్థితి భారత్ లో రిపీట్ అయితే.. ఇక్కడున్న జనాభాను బట్టి రోజుకు 14 లక్షల కేసులు నమోదుకావచ్చని పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ లో నమోదైనట్లే.. ఇక్కడ కూడా ఒమిక్రాన్ విజృంభిస్తే రోజుకు 13 లక్షల కరోనా కేసులు రికార్డవుతాయని తెలిపారు. యూరప్ దేశాల్లో సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ 80శాతం పూర్తయినప్పటికీ.. డెల్టా ఉధృతిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని పాల్ చెప్పుకొచ్చారు. ఫ్రాన్స్ లో ప్రస్తుతం రోజుకు 65 వేల చొప్పున కొత్తకేసులు నమోదవుతుండగా.. అక్కడి పరిస్థితులను ఇక్కడి జనాభాతో పోలిస్తే.. డేంజర్ బెల్స్ మోగుతాయని హెచ్చరించింది కేంద్రం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, కరోనా పట్ల ఏమాత్రం అశ్రద్ధ తగదని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం హెచ్చరించింది.
వేడుకలకు దూరంగా ఉండాలి
అలాగే ప్రజలు కూడా అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ఇంకా వ్యాక్సినేషన్ తీసుకోనివారు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దారాన్ని పాటిస్తూ.. శానిటైజర్లను వాడాలని విజ్ఞప్తి చేసింది. అలాగే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేవారంతా గుంపులుగుంపులుగా ఉండరాదని, అతికొద్దిమందితోనే వేడుకలు జరుపుకోవడం సురక్షితమని తెలిపింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో రోజువారి కరోనా కేసులు 10 వేల లోపే ఉన్నప్పటికీ.. ముందు జాగ్రత్తలు పాటిస్తే తర్వాత కరోనా ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ హితవు పలికారు.
Next Story