Mon Dec 23 2024 06:24:24 GMT+0000 (Coordinated Universal Time)
fake astronaut : భూమ్మీదికి రాగానే పెళ్లిచేసుకుంటానని నమ్మించి.. రూ.25 లక్షలు స్వాహా
ఐఎస్ఎస్ నుంచి తిరిగి భూమ్మీదికి రావాలంటే.. రాకెట్ ఫీజు కోసం డబ్బు కావాలని మహిళకు సందేశం పంపాడు.
తానొక వ్యోమగామినని, ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నానని, భూమ్మీదికి రాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఓ మహిళ నుంచి అక్షరాలా రూ.25 లక్షలను కాజేశాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ మహిళ వయసు 65 సంవత్సరాలు. సోషల్ మీడియా వేదికగా జపాన్ దేశంలో జరిగిందీ మోసం. తాను రష్యా వ్యోమగామినని, ప్రస్తుతం అంతరిక్షంలో అంతర్జాతీయ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్)లో ఉన్నానంటూ ఓ వ్యక్తి జపాన్ లోని 65 ఏళ్ల మహిళను నమ్మించాడు. భూమికి తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటానని.. అందుకు రాకెట్ ఫీజుకోసం డబ్బు కావాలని సందేశం పంపాడు. నిజమేననుకున్న ఆమె.. పాతికలక్షలు ఇచ్చింది.
బాధిత మహిళ జపాన్ లోని షిగా రాష్ట్రంలో నివసిస్తోంది. ఆ ఫేక్ ఆస్ట్రోనాటర్ ఈ ఏడాది జూన్ లో ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు పరిచయమయ్యాడు. స్పేస్ సూట్ ధరించి ఉన్న అతడి ఫొటోలు చూసిన ఆ వృద్ధురాలు అతడు నిజంగానే వ్యోమగామి అని నమ్మింది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. కొన్నిరోజులకి.. 'లైన్' అనే జపాన్ మెసేజింగ్ యాప్ ద్వారా మెసేజ్ లు పంపుకునేవారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఆమెకు ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఇద్దరం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చెప్పాడు. ఆమె తన ఉచ్చులోకి పడిపోయిందని గ్రహించాడు మోసగాడు.
ఐఎస్ఎస్ నుంచి తిరిగి భూమ్మీదికి రావాలంటే.. రాకెట్ ఫీజు కోసం డబ్బు కావాలని మహిళకు సందేశం పంపాడు. అది నిజమేనని నమ్మిన ఆ వృద్ధురాలు..ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 5 మధ్యలో పలు విడతలుగా డబ్బు పంపింది. అడగటమే ఆలస్యం.. అడిగినంత డబ్బు పంపుతుండటంతో అతనిలో దురాశ పెరిగింది. పదే పదే డబ్బు అడుగుతుండటంతో ఆమెకు అతనిపై అనుమానం కలిగింది. అతని కోసం వివరాలు తెలుసుకోవాటానికి యత్నించినా ఏమాత్రం ఫలితం దొరకలేదు. దీంతో మోసపోయానను గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అతనో ఫేక్ వ్యోమగామి అని తేలింది. ఆ విషయం తెలిసి ఆమె షాకయింది.
Next Story