Tue Dec 24 2024 18:27:49 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ లో హిందూ వైద్యుడి దారుణ హత్య
ఈ కాల్పుల్లో జినానీ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయనతో ఉన్న మరో వైద్యురాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల ఘటన అనంతరం..
పాకిస్థాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. హిందూ వైద్యుడిని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. కరాచీ నగరంలో గురువారం జరిగిందీ ఘటన. మృతుడు డా. బీర్బల్ జినానీ గా గుర్తించారు. బీర్బల్ జినాని కంటివైద్యుడు. ఆయన గతంలో కరాచీ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగానికి సీనియర్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
డా. జినానీ తన అసిస్టెంట్ అయిన మరో వైద్యురాలితో కలిసి కారులో గుల్షణ్-ఏ-ఇక్బాల్ ప్రాంతానికి వెళ్తుండగా.. లైయారీ ఎక్స్‌ప్రెస్ హైవేపై గార్డెన్ క్రాస్‌రోడ్స్ వద్దకు కారు చేరుకోగానే దుండగులు దాడి చేశారు. జినానీపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో జినానీ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయనతో ఉన్న మరో వైద్యురాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల ఘటన అనంతరం డా. జినానీ ప్రయాణిస్తున్న కారు అదుపు కోల్పోయి ఓ గోడకు ఢీకొనడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. నిందితులు కావాలనే డా. జినానీని టార్గెట్ చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. డా. జినానీ హత్యపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కరాచీ పోలీస్ అడిషనల్ ఇన్స్‌స్పెక్టర్ జనరల్‌ను ఆదేశించారు. డా. జినానీ ని హత్య చేసిందెవరు ? ఎందుకు చేశారు ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. కాగా.. నెలరోజుల వ్యవధిలో పాకిస్థాన్ లో ఇద్దరు వైద్యులు హత్య చేయబడటం కలకలం రేపుతోంది.
Next Story