Thu Nov 07 2024 19:32:47 GMT+0000 (Coordinated Universal Time)
ఇంగ్లాండ్ లో పేలిన వరల్డ్ వార్ 2 నాటి బాంబు
అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాంబును గుర్తించిన ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రదేశాల్లోని నివాసితులను..
రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబును గుర్తించి.. నిర్వీర్యం చేస్తుండగా..భారీ పేలుడు సంభవించింది. ఇంగ్లాండ్ లోని నార్ ఫోల్క్ కౌంటీలో ఈ పేలుడు సంభవించింది. ఇది హఠాత్తుగా జరిగిందని అక్కడి పోలీసులు వివరించారు. ఈ పేలుడు ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని స్పష్టం చేశారు. మంగళవారం నార్ ఫోల్క్ కౌంటీలోని గ్రేట్ యార్మౌత్ టౌన్ లో అధికారులు రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబుని గుర్తించారు. దానిని నిర్వీర్యం చేసేందుకు చర్యలు చేపట్టారు.
అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాంబును గుర్తించిన ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రదేశాల్లోని నివాసితులను ఖాళీ చేయించారు. ట్రాఫిక్ ను దారి మళ్లించి, రోబోలతో బాంబును డిఫ్యూజ్ చేయడానికి ఉపక్రమించారు. ఈ ప్రయత్నంలో బాంబు పేలి.. భారీ విస్ఫోటనం జరిగింది. ఆ దృశ్యాలు డ్రోన్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఆస్తినష్టాన్ని అంచనా వేస్తున్నామని వివరించారు. చుట్టుపక్కల జనావాసాలకు చెందిన ప్రజలు తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లొచ్చని పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా.. పేలుడు కారణంగా భారీగా దుమ్ము, ధూళి గాలిలోకి ఎగిసిపడింది. ఆ ప్రాంతమంతా కొద్దిసేపు పొగ నిండిపోయింది.
Next Story