Mon Dec 23 2024 16:14:01 GMT+0000 (Coordinated Universal Time)
China OutBreak : చైనాలో కరోనా కల్లోలం.. ఏకంగా నాలుగు వేరియంట్ల వ్యాప్తి
చైనా సహా బ్రెజిల్, జపాన్, అమెరికా, కొరియా వంటి దేశాల్లోనూ వైరస్ చాపకిందనీరులా వ్యాప్తి చెందుతోంది.
రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న మహమ్మారి కరోనావైరస్ పీడ విరగడైందని అనుకునేలోపే.. మళ్లీ ఆ రక్కసి కోరలు చాస్తోంది. ఒమిక్రాన్, ఒమిక్రాన్ సబ్ వేరియంట్లుగా రూపాంతరం చెంది.. శరవేగంగా వ్యాపిస్తూ మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాప్తికి కారణమైన చైనాలో కరోనా రక్కసి కోరలు చాచింది. ప్రతినిత్యం లక్షలు, కోట్ల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. డ్రాగన్ కంట్రీలో కరోనా విలయతాండవం చేస్తున్నా.. అధికారిక లెక్కలను మాత్రం బయటకు రానీయడం లేదు. గతంలో మాదిరిగానే.. చైనా తన దేశంలో కరోనా మరణాలు పెద్దగా నమోదుకావడంలేదంటూ దొంగ లెక్కలు చెబుతోంది.
అక్కడ వైరస్ వ్యాప్తికి BF7 వేరియంటే కారణమని అనుకుంటున్నాయి ప్రపంచదేశాలు. చైనా సహా బ్రెజిల్, జపాన్, అమెరికా, కొరియా వంటి దేశాల్లోనూ వైరస్ చాపకిందనీరులా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో చైనాలో కరోనా ఉధృతికి కారణం ఒక వేరియంట్ మాత్రమే కాదని.. అక్కడ నాలుగు వేరియంట్లు ఉన్నాయంటూ భారత ప్రభుత్వ కొవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్కే అరోరా మీడియాకు తెలిపారు. చైనాలో కరోనా ఉద్ధృతిని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
చైనాలో కోవిడ్ వేవ్‌కు పలు రకాల వేరియంట్లే కారణమని..బీఎఫ్.7 వేరియంట్ కేసులు కేవలం 15శాతమే అని తెలిపారు.BN,BQ వేరియంట్ల నుంచి 50 శాతం కేసులు వస్తుండగా.. SVV వేరియంట్ నుంచి మరో 15 శాతం కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. మన దేశ ప్రజల్లో హైబ్రీడ్ ఇమ్యూనిటీ ఉన్నందున భయపడాల్సిన పని లేదన్నారు. చైనాతో పోలిస్తే భారత్ లో 97 శాతం మంది రెండు డోసుల టీకాలు తీసుకున్నారని.. అదే మనల్ని కాపాడుతుందని అరోరా ధైర్యం చెప్పారు.
Next Story