Fri Nov 22 2024 20:16:42 GMT+0000 (Coordinated Universal Time)
ఇంగ్లాండ్ లో తెలంగాణ విద్యార్థిని మృతి.. మంత్రి చొరవతో..
తేజస్విని మృతదేహాన్ని యూకేలోని ఓ ఆస్పత్రిలో భద్రపరిచారు. ఆమె మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు సహకరించాలని..
రెండ్రోజుల క్రితం గుండెపోటుతో అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి చెందిన ఘటన మరువకముందో.. ఇంగ్లాండ్ లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ విద్యార్థిని కె.సాయి తేజస్విని రెడ్డి ఇంగ్లాండ్ లో మరణించింది. హైదరాబాద్ కు చెందిన సాయి తేజస్విని లండన్ లోని ఓ బీచ్ కు వెళ్లి.. అక్కడ అలల తాకిడి తట్టుకోలేక మరణించింది. హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజిన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె.శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకైక కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఉన్నత చదువుల కోసం లండన్ కు వెళ్లింది.
యూకేలోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో సాయితేజస్విని ఏరోనాటిక్స్, స్పేస్ మాస్టర్ డిగ్రీ ఇంజినీరింగ్ చదువుతోంది. ఏప్రిల్ 11న ఆమె లండన్ లోని బ్రైటన్ బీచ్ కు వెళ్లింది. ప్రమాదవశాత్తు అక్కడ అలల్లో చిక్కుకుని తేజస్విని మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తేజస్విని మృతదేహాన్ని యూకేలోని ఓ ఆస్పత్రిలో భద్రపరిచారు. ఆమె మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు సహకరించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆమె కుటుంబ సభ్యులు ట్విటర్ ద్వారా కోరారు. దీంతో వారి అభ్యర్థనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘మీకు జరిగిన నష్టానికి చాలా చింతిస్తున్నాం.. నా టీమ్ స్థానిక బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ ను కలిసి వెంటనే సహాయం చేస్తుంది’ అని రీ ట్వీట్ చేశారు. కె.సాయి తేజస్విని రెడ్డి మృతదేహాన్ని శుక్రవారం ఢిల్లీకి చేరకుంటుందని బీజేపీ ఐఎస్ సదన్ డివిజన్ కు చెందిన భాగ్యనగర్ జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్ర బాబు పేర్కొన్నారు. అదే రోజు రాత్రికి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చేస్తున్నారని పేర్కొన్నారు.
Next Story