Mon Dec 23 2024 08:55:10 GMT+0000 (Coordinated Universal Time)
పొలంలో పని చేస్తూ ఉండగా.. భారతీయుడిపై పడ్డ క్షిపణి
క్షిపణి దాడిలో భారతీయుడు మృతి.. పొలంలో పని చేస్తూ ఉండగా.. భారతీయుడి
లెబనాన్ నుండి ప్రయోగించిన యాంటీ ట్యాంక్ క్షిపణి ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు భాగంలోని మార్గాలియోట్ సమీపంలోని పండ్ల తోటలో పడింది. ఈ ఘటనలో ఒక భారతీయ జాతీయుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ముగ్గురు భారతీయులు కేరళకు చెందిన వారని నివేదిక పేర్కొంది. బాధితుడిని కేరళలోని కొల్లంకు చెందిన 31 ఏళ్ల పాట్ నిబిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు. అతనికి ఐదేళ్ల కుమార్తె ఉంది. భార్య ప్రస్తుతం ప్రెగ్నెంట్. మాక్స్వెల్ రెండు నెలల క్రితమే ఇజ్రాయెల్‌కు వచ్చాడని.. దాడి జరిగిన సమయంలో పొలంలో పని చేస్తున్నాడని తెలిపారు. చనిపోయిన వ్యక్తితో సహా గాయపడ్డ మిగిలిన వారితో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూ ఉంది. నార్తరన్ ఇజ్రాయెల్ లోని వ్యవసాయ క్షేత్రంపై క్షిపణి దాడి జరిగింది. లెబనాన్ వైపు నుంచి దూసుకొచ్చిన మిసైల్ వ్యవసాయ క్షేత్రంలో పడడంతో భారీ పేలుడు సంభవించింది.
గాయపడిన ఇద్దరు భారతీయులను బుష్ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌లుగా గుర్తించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ క్షిపణి ఢీకొట్టిందని రెస్క్యూ సర్వీసెస్ మాగెన్ డేవిడ్ ఆడమ్ (MDA) ప్రతినిధి జాకీ హెల్లర్ PTIకి తెలిపారు. "ముఖం, శరీరంపై గాయాలతో జార్జ్‌ను పెటా టిక్వాలోని బీలిన్సన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను కోలుకుంటున్నాడు. అతను భారతదేశంలోని తన కుటుంబంతో మాట్లాడాడు" అని అధికారులు తెలిపారు. మెల్విన్ స్వల్పంగా గాయపడ్డాడు. ఉత్తర ఇజ్రాయెల్ నగరమైన సఫేద్‌లోని జివ్ ఆసుపత్రిలో ఉన్నాడు. ఇతడు కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందినవాడు. లెబనాన్‌లోని షియా హిజ్బుల్లా వర్గం ఈ దాడికి పాల్పడిందని నమ్ముతున్నారు. హమాస్‌కు మద్దతుగా అక్టోబర్ 8 నుండి ఉత్తర ఇజ్రాయెల్‌పై లెబనాన్ ప్రతిరోజూ రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది.
Next Story