Mon Dec 23 2024 19:41:39 GMT+0000 (Coordinated Universal Time)
కోహినూర్ ను భారత్ కు ఇవ్వాలని ఆన్ లైన్ పిటీషన్స్.. అసలు అయ్యేపనా..?
క్వీన్ ఎలిజబెత్ II ఇటీవలే కన్నుమూశారు. ఆమె కన్నుమూసిన తర్వాత నుండి కోహినూర్ వజ్రం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది.
క్వీన్ ఎలిజబెత్ II ఇటీవలే కన్నుమూశారు. ఆమె కన్నుమూసిన తర్వాత నుండి కోహినూర్ వజ్రం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. క్వీన్ ఎలిజబెత్ II మరణించినప్పటి నుండి భారతీయులు 'కోహినూర్'ని తిరిగి ఇవ్వాలనే కోరికను బహిరంగంగా వ్యక్తం చేశారు. "కోహినూర్", "రిటర్న్ కోహినూర్ డైమండ్" వంటి హ్యాష్‌ట్యాగ్ లు వైరల్ అవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. అనేక మంది భారతీయులు సోషల్ మీడియాలో తమ కోరికను వ్యక్తం చేయడమే కాకుండా, కోహినూర్ డైమండ్‌ని భారత్ కు తిరిగి ఇవ్వాలని change.orgలో ఆన్లైన్ పిటిషన్‌పై సంతకాల సేకరణ మొదలుపెట్టారు.
వెంకటేష్ శుక్లా అనే పిటిషనర్, కోహినూర్‌ను తిరిగి భారతదేశానికి పంపాలని change.orgలో ఆన్లైన్ పిటిషన్‌ను ప్రారంభించారు. ఈ పిటిషన్ కోసం కనీసం ఒక మిలియన్ సంతకాలు సేకరించాలని ఆయన భావిస్తున్నారు. భారతీయ పౌరులందరినీ వారి స్థానిక బ్రిటీష్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు, హైకమీషన్లను సంప్రదించి, గౌరవప్రదంగా.. శాంతియుతంగా ఈ పిటిషన్‌ను వారికి సమర్పించాలని ఆయన స్వాగతించారు. కోహినూర్ వజ్రాన్ని ఇంకా యూకే లోనే ఉంచుకోవడం నైతికంగా సమర్థించబడదన్నారు. దానిని ఎక్కడి నుంచి తీసుకువెళ్లారో అక్కడి నుంచి భారత్‌కు తిరిగి పంపడమే సరైన పని అని ఆయన అన్నారు. కోహినూర్‌ను స్వచ్ఛందంగా అప్పగించడం యూకేకు మరింత గౌరవాన్ని అందిస్తుందని వెంకటేష్ శుక్లా తెలిపారు.
కోహినూర్ చరిత్ర:
ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా కోహినూరుకు పేరుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని కొల్లూరు గనుల్లో దొరికింది. 105 క్యారెట్లు గల ఈ వజ్రం మొదటి యజమాని మాల్వా రాజు మహలక్ దేవ్ అని చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన చేతిలో క్రీ.శ. 1300వ సంవత్సరంలో ఈ వజ్రం ఉండేదని.. అయితే మాల్యా పాలక వంశాన్ని అల్లా ఉద్దీన్ ఓడించి.. అక్కడి ధనరాశులతో పాటు కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెబుతుంటారు.
మరో కథనం ప్రకారం కోల్లూరులో లభ్యమైన ఈ కోహినూర్ వజ్రం, కాకతీయుల కాలంలో గోల్కొండ కోటలో ఉండేది. అయితే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1310లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్తో సంధి చేసుకుని అపారమైన సంపదతో పాటు, కోహినూర్ వజ్రాన్ని సమర్పించుకున్నాడు. అలా ఢిల్లీ చేరిన కోహినూర్ వజ్రం పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఇబ్రహీం లోఢీ ఓటమి పాలై మరణించాడు. లోఢీ మరణానంతరం సుల్తానుల ఖజానాతో పాటు కోహినూర్ వజ్రం బాబర్ వశమైంది. ఆ సమయంలో దీనికి బాబర్ వజ్రంగా కూడా పేరు పొందింది. బాబర్ తర్వాత ఈ వజ్రాన్ని హుమాయూన్‌కి ఇచ్చాడు. మొఘల్ రాజవంశం పతనావస్థకు చేరిన సమయంలో ఇరాన్ బాద్షా నాదిర్షా దండయాత్రకు వచ్చాడు. మహమ్మద్ షాను ఓడించి సామ్రాజ్యం మొత్తాన్ని ఆక్రమించాడు. శతాబ్దాల నుంచి సేకరించిన మొఘల్ సంపదను, పట్టణంలోని సంపన్నులు, ప్రముఖుల అందరి సొత్తును కాజేశాడు. ఆ తర్వాత రెండున్నర నెలలకు భారత పగ్గాలను తిరిగి మహమ్మద్ షాకు అప్పగించి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చివరకు 1739 మే 12న పగ్గాలు అప్పగించాడు. ఆ సమయంలోనే ఢిల్లీలోని ఒక పరిచారిక నాదిర్షాకు విలువైన సమాచారాన్ని అందించింది. మీరు సేకరించిన మొత్తం సంపద కంటే విలువైన వస్తువు ఒకటి ఉందని.. దాన్ని మహమ్మద్ షా తన తలపాగాలాలో దాచాడని తెలిపింది. దీంతో ఎలాగైనా ఆ వజ్రాన్ని కొట్టేయాలని నాదిర్ షా ఒక ఉపాయం పన్నాడు. నాదిర్ షా ఇరాన్ బయల్దేరే ముందు.. మహమ్మద్ షాతో ఇరాన్లో ఒక సంప్రదాయం ఉందని చెప్పాడు. సంతోషంగా ఉన్న సమయంలో సోదరులు తమ తలపాగాలు మార్చుకుంటారని అన్నాడు. ఈ రోజు నుంచి మనం సోదరులం నా సంతోషం కోసం మనం కూడా తలపాగాలు మార్చుకుందామా అని మహమ్మద్ షాను అడిగాడు. అప్పుడు నాదిర్ షా ముందు తలవంచడం తప్ప ఏమీ అనలేని పరిస్థితిలో పడిపోయాడు మహమ్మద్ షా. నాదిర్ షా తన తలపాగాను మహమ్మద్ షా తలపై పెట్టి ఆయన తలపాగాను తీసి తన తలపై పెట్టుకున్నాడు. తొలిసారి నాదిర్ షా ఆ వజ్రాన్ని చూడగానే కోహ్-ఇ-నూర్ అని అభివర్ణించాడు. అప్పటినుంచి ఆ వజ్రానికి కోహినూర్ అనే పేరు స్థిరపడింది. తొలిసారి కోహినూర్ వజ్రం భారతదేశం దాటి ఇరాన్ వెళ్లింది. నాదిర్ షా తర్వాత కోహినూర్ వజ్రం అఫ్ఘనిస్థాన్ ఎమిర్ అహ్మద్ షా అబ్దాలీ చేతుల్లోకి వెళ్లింది. క్రీ.శ.1913వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్ రాజుల నుంచి కోహినూర్ వజ్రాన్ని లాహోర్ కేంద్రంగా పంజాబ్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజా రంజిత్ సింగ్ సొంతం చేసుకున్నాడు. చిన్న వయసులోనే పట్టాభిషిక్తుడైన దులీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. వజ్రం మరింత మెరవాలని క్వీన్ విక్టోరియా ఆ వజ్రానికి సాన పెట్టించింది. కానీ ఆ వజ్రం నాణ్యత 186 క్యారెట్ల నుంచి 108 క్యారెట్లకు తగ్గింది. ఆ తర్వాత ఈ వజ్రాన్ని క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్ ధరించారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా బ్రిటన్ను భారత ప్రభుత్వం చాలాసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు.
Next Story