Mon Dec 23 2024 09:13:08 GMT+0000 (Coordinated Universal Time)
మోఖా తుఫాను విలయం తప్పదు.. ఇన్ శాట్ ఉపగ్రహం తీసిన చిత్రం ఇదిగో
తాజాగా భారత వాతావరణ సంస్థ తుఫానుపై బులెటిన్ విడుదల చేసింది. పోర్టుబ్లెయిర్ కు పశ్చిమ వాయవ్యదిశగా 530 కిలోమీటర్ల..
బంగాళాఖాతంలో ఏర్పడిన మోఖా తుఫాను మరింత బలపడింది. మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మోఖా తుఫాను ఉత్తర దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తాజాగా ఈ తుఫానుకు సంబంధించి ఓ ఫొటో విడుదలైంది. అంతరిక్షం నుంచి భారత వాతావరణ ఉపగ్రహం ఇన్ శాట్ -3 డీఆర్ చిత్రీకరించింది. వందల కిలోమీటర్ల దూరం నుంచి మేఘాలను, గాలులను బలంగా ఆకర్షిస్తూ.. సుడులు తిరుగుతోన్న తుఫాను వలయాన్ని ఇన్ శాట్ ఉపగ్రహంలోని అత్యాధునిక కెమెరాలు బంధించారు. ఈ చిత్రంలో సైక్లోన్ స్పష్టంగా కనిపిస్తోంది.
తాజాగా భారత వాతావరణ సంస్థ తుఫానుపై బులెటిన్ విడుదల చేసింది. పోర్టుబ్లెయిర్ కు పశ్చిమ వాయవ్యదిశగా 530 కిలోమీటర్ల దూరంలోనూ, బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ కు దక్షిణ నైరుతి దిశగా 950 కిలోమీటర్ల దూరంలో, మయన్మార్ లోని సిట్వే తీరానికి దక్షిణ నైరుతి దిశగా 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తోందని, మే 14 మధ్యాహ్నం నాటికి కాక్స్ బజార్(బంగ్లాదేశ్), క్యాక్ ప్యు (మయన్మార్) మధ్య తీరం దాటనుందని ఐఎండీ అంచనా వేసింది. తుఫాను తీరం దాటేటప్పుడు విలయం తప్పేటట్లు లేదని తెలిపింది.
భూభాగంపైకి చేరేటప్పటికి తీవ్ర తుఫానుగానే ఉంటుందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. గంటకు తీరంవెంబడి 175 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. తీరని నష్టాలను వాటిల్లేలా చేస్తాయని, పేద దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్ అల్లకల్లోలం అవుతాయని అంచనా వేస్తున్నారు. మోఖా తుఫాను ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Next Story