హమాస్‌ను ఖతం చేసే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు - ఇజ్రాయెల్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. గాజా లోకి ప్రవేశించాయి ఇజ్రాయెల్ యుద్ద ట్యాంకులు. హమాస్‌ను ..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. గాజా లోకి ప్రవేశించాయి ఇజ్రాయెల్ యుద్ద ట్యాంకులు. హమాస్‌ను ఖతం చేసే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే గాజాలో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో మార్చురీలు నిండిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ రాజధాని టెల్అవివ్పై మరోసారి హమాస్ రాకెట్ దాడులు చేసింది. ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొట్టింది. గాజాలో ఉన్న హమాస్ తీవ్రవాదుల ఏరివేతకు ఇజ్రాయెల్ బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. హమాస్ చెరలో ఇప్పటికి కూడా 150 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. వాళ్లను విడిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో సీనియర్ హమాస్ కమాండర్ హతమయ్యాడు.
ఇజ్రాయెల్ దాడుల్లో 2215 మంది గాజా వాసుల మృతి
ఇజ్రాయెల్ దాడులతో లక్షలాది మంది పాలస్తీనా పౌరులు గాజా నుంచి పారిపోతున్నారు. నాలుగు లక్షల మంది గాజాను విడిచినట్టు తెలుస్తోంది. దక్షిణ గాజా వైపు జనం ఆశ్రయం కోసం పారిపోతున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో 2215 మంది గాజా వాసులు ప్రాణాలు కోల్పోయారు. గాజా స్ట్రిప్‌ను ప్రజలు విడిచిపెట్టి దక్షిణ ప్రాంతానికి వెళ్లడానికి ఇజ్రాయెల్ సైన్యం అదనంగా ఆరుగంటల సమయం ఇచ్చింది. పైగా రెండు దారుల్లో వెళ్లాలంటూ విమానం నుంచి కరపత్రాలు జారవిడిచింది. తీరం నుంచి ఒకదారి, గాజా మధ్య నుంచి మరో దారి గుండా వెళ్లాలని సూచించింది. అయితే గాజా జనానికి నీళ్లు కూడా లేవనీ, ఇదంతా జీవన్మరణ సమస్య అని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
ఒకవైపు గాజా ప్రజలను హెచ్చరిస్తూనే, మరోవైపు అదే గాజా మీద ఇజ్రాయెల్ రాకెట్ దాడులకు దిగింది. గత 24 గంటల్లో జరిగిన దాడుల్లో 324 మంది చనిపోయారు. అయితే హమాస్ రాకెట్లు ప్రయోగిస్తున్న ప్రాంతాలను తాము ఈసారి టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అందుకే హమాస్ రాకెట్ స్థావరాలను తాము ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు గాజా బోర్డర్లో తిష్టవేశాయి. గ్రౌండ్ ఆపరేషన్‌కు ముందు యుద్ధట్యాంకులు గర్జించాయి. హమాస్ టార్గెట్‌గా దాడులకు దిగాయి. అటు హమాస్‌ను నలిపేయాలంటూ ఇజ్రాయెల్ కమాండర్ తమ సైనికులకు పిలుపునిచ్చారు. యావత్ ఇజ్రాయెల్ మనవైపు చూస్తోందనీ, మనపై నమ్మకం ఉంచిదంటూ ఆయన పిలుపునిచ్చారు. ఒకవైపు గాజాపై పోరాటానికి ఇజ్రాయెల్ రెడీ అయితే, మరోవైపు లెబనాన్ నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద దాడులకు దిగాయి. అయితే హిజ్బుల్లా డ్రోన్లను ఆకాశంలోనే ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఆ తర్వాత లెబనాన్‌పైకి ఇజ్రాయెల్ దాడులకు దిగింది.