Sun Dec 22 2024 13:02:40 GMT+0000 (Coordinated Universal Time)
విలాసవంతమైన రైల్లో రష్యాకు బయలుదేరిన 'కిమ్'
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా బయలుదేరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కిమ్ నేడు భేటీ..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా బయలుదేరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కిమ్ నేడు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆయుధ అంశాలపై చర్చల కోసమే ఆయన రష్యాకు వెళ్లినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, పుతిన్‌తో కిమ్ భేటీ ఎప్పుడు, ఎక్కడ అన్నది మాత్రం క్లారిటీ లేదు. కిమ్ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి విలాసవంతమైన రైల్లో రష్యాకు బయలు దేరినట్లు, కిమ్ తన సైనికులు, సీనియర్ వ్యక్తులతో కలిసి రష్యా వెళ్లారని కొరియన్ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం పుతిన్-కిమ్‌ల భేటీ ఉండవచ్చని అంచనా వేశాయి. కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కిమ్ ఏ దేశంలోనూ ప్రయాణించలేదు.
కాగా, రష్యాకు కిమ్ రావడం ఇది రెండోసారి. 2019లో ఆయన మొదటిసారి ఆ దేశాన్ని సందర్శించారు. తర్వాత ఇప్పుడే. ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలోని రష్యా నగరమైన వ్లాదివోస్కీలో రష్యా అధ్యక్షుడితో ఆయన భేటీ అయ్యారు. ఈ సారి కూడా ఆ నగరంలోనే భేటీ ఉండొచ్చని తెలుస్తోంది. పుతిన్ ఆహ్వానం మేరకు ఆయన క్రెమ్లిన్ వెళ్లినట్లు సమాచారం. కిమ్ అంతర్జాతీయ పర్యటనల విషయానికి వస్తే రైలు ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తారు. అతని తండ్రి కిమ్ జోంగ్ ఇల్ విమానాల్లో ప్రయాణాలకు భయపడ్డారు. కిమ్ ఇప్పుడు కూడా ఇలానే విలాసవంతమైన రైల్లో 20 గంటల పాటూ ప్రయాణించారు. మరోవైపు ఉత్తర కొరియాపై అమెరికా పలు ఆరోపణలు చేసింది. రష్యాకు కిమ్ ఆయుధాలను అందిస్తున్నట్లు అగ్రరాజ్యం పేర్కొంది. ప్రైవేటు మిలిటరీ వాగ్నర్ గ్రూపునకు ఉత్తర కొరియా ఆయుధాలు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధానికి మాస్కోకు ఆయుధాలను సరఫరా చేస్తే ప్యోంగ్యాంగ్ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వైట్ హౌస్ ఇటీవల హెచ్చరించింది.
Next Story