Mon Dec 23 2024 18:10:03 GMT+0000 (Coordinated Universal Time)
అందం కోసం వరుస సర్జరీలు.. యువతి మృతి
కిమ్ కర్డాషియన్ ను చూసి.. ఆమెలా కనిపించాలని చాలా మంది అమ్మాయిలు భావిస్తుంటారు. కొందరు ఓ అడుగు ముందుకేసి..
ఆడపిల్లగా పుట్టిన ఏ అమ్మాయైనా అందంగా ఉండాలనుకుంటుంది. అందులో తప్పేం లేదు. కానీ కొందరు సెలబ్రిటీల్లాగా మారిపోవాలనుకుంటారు. అందుకోసం మరొకరిలా తమను తాము మార్చుకుంటారు. కొందరు అలాంటి అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంటారు. అది వికటిస్తే మాత్రం.. అందం కాదు కదా జీవితమే ఉండదు. సినిమా తార కాకపోయినా ఆ స్థాయిలో పాప్యులర్ అయిన అందాల భామ కిమ్ కర్డాషియన్. అమెరికాకు చెందిన ఈ సెలబ్రిటీ తన రూపలావణ్యాలు శరీర ఆకృతి, తన విలాసవంతమైన జీవనశైలి కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.
కిమ్ కర్డాషియన్ ను చూసి.. ఆమెలా కనిపించాలని చాలా మంది అమ్మాయిలు భావిస్తుంటారు. కొందరు ఓ అడుగు ముందుకేసి ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకున్నారు. అమెరికాకు చెందిన క్రిస్టినా ఆష్టన్ గౌర్కానీ కూడా ఆ కోవకు చెందినదే. ఆమె స్వస్థలం కాలిఫోర్నియా. మోడలింగ్ ద్వారా అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సర్జరీల అనంతరం అచ్చం కిమ్ కర్డాషియన్ లా ఉందే అనిపించుకుని మురిసిపోయింది. కిమ్ లా ఉండటంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.
34 ఏళ్ల వయసులో గౌర్కానీ మరింత అందంగా ఉండాలని మరో సర్జరీ చేయించుకుంది. కానీ అది కాస్తా వికటించడంతో ప్రాణాలు కోల్పోయింది. శస్త్రచికిత్స అనంతరం గౌర్కానీ తీవ్ర గుండెపోటుకు గురైందని, ఆమె మరణానికి కారణం అదేనని కుటుంబ సభ్యులు తెలిపారు. సర్జరీ కారణంగా ఆమె గుండె పనితీరులో లోపాలు తలెత్తాయని, నాడీ వ్యవస్థ దెబ్బ తిన్నందునే ఆమె మరణించిందని తెలిపారు.
Next Story