Mon Dec 23 2024 13:55:53 GMT+0000 (Coordinated Universal Time)
బీకేర్ ఫుల్.. కరోనా డేంజర్ తొలగలేదు : బిల్గేట్స్
ఫ్యూచర్ లో పుట్టుకొచ్చే కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వాలు ఇప్పటి నుంచే ప్రణాళికలు..
న్యూఢిల్లీ : కరోనా పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. రెండేళ్లుగా ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోలేదనీ, ఇప్పటి వరకు ఉన్న కొత్త వేరియంట్లకన్నా తీవ్రమైనవి, ప్రభావవంతమైనవి మరిన్ని కరోనా వేరియంట్సు ముంచుకుని రావచ్చనీ, అందుకు ప్రజలూ, ప్రభుత్వాలూ సిద్ధంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న సాధారణ వేరియంట్ల కన్నా మరింత ప్రమాదకరమైనవి వేరియంట్ల ప్రభావం రానున్నదన్నారు. తాను నిరాశానిస్పృహలతో లేదా ప్రజలను భయపెట్టే ఉద్దేశ్యంతో ఈ విషయం చెప్పడం లేదనీ, ఇప్పటివరకూ మనం చూసిన వేరియంట్ల కంటే ఐదు శాతం ప్రమాదకరమైన వేరియంట్లు విస్తరించే ప్రమాదం ఉందని బిల్ గేట్స్ హెచ్చరించారు.
ఫ్యూచర్ లో పుట్టుకొచ్చే కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వాలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకుని అన్ని రకాల సదుపాయాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్లతో పలు దేశాల్లో ఎంతో మంది ప్రాణాలను బలిగొందని.. మున్ముందు వచ్చే కొత్త వేరియంట్లపై ప్రమాదం గురించి శాస్త్రజ్ఞులు ప్రజలకు వివరంగా తెలియజేయాలనీ, ప్రభుత్వాలు కూడా ఈ వేరియంట్ల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను హెచ్చరించడం, జాగ్రత్తలను సూచించడం వంటి చర్యలు తీసుకోవాలని బిల్గేట్స్ ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు.
అయితే కొవిడ్ 19 గురించి బిల్ గేట్స్ 2015లోనే హెచ్చరించారు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదని.. ఒక వేళ ప్రపంచ దేశాలు అప్పట్లోనే జాగ్రత్త పడి ఉంటే నష్టాన్ని తగ్గించి ఉండేవారమన్నారు. ఇప్పటికైనా మనం మేల్కొని ఈ కొత్త వేరి యంట్ల రిస్క్ నుంచి మానవాళిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా రిస్క్ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి పౌరులు కూడా తమ పరిధిలో జాగ్రత్తలను తీసుకోవాలనీ, కరోనా పూర్తిగా తొలగిపోయిందన్న అలసత్వం,నిర్లిప్తత పనికి రావని ఆయన హెచ్చరించారు.
Next Story