Tue Dec 24 2024 12:23:47 GMT+0000 (Coordinated Universal Time)
విడిపోయాకే తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి : మంత్రి ఎర్రబెల్లి
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..తెలుగు ప్రజలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధిలో..
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం.. ఫిలడెల్ఫియాలో జరుగుతున్న తానా మహా సభలకు తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తానా సభలు ముగిసిన అనంతరం అక్కడి ప్రముఖ ప్రాంతాలను మంత్రి సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన ఫిలడెల్ఫియా లోని సాయి దత్త ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..తెలుగు ప్రజలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధిలో NRI ల పాత్ర, తెలుగు ప్రజలను కలుపుతున్న TANA సభలు వంటి అనేక అంశాల మీద తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తానా మహా సభలు అత్యంత వైభవోపేతంగా జరిగాయన్నారు. తెలుగు ప్రభుత్వాల ప్రతినిధులు, మంత్రులు, తెలుగు వారైన ప్రముఖులు, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ముఖ్యులు, అనేక మంది హాజరయ్యారు. తమకు ఆతిథ్యం ఇవ్వడానికి అమెరికా నలుమూలల నుంచి వచ్చిన తెలుగు ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు వారు ఎక్కడ ఉన్నా మన దేశ భక్తిని, కన్న తల్లిని, పుట్టిన ఊరిని మరచిపోలేదని అన్నారు. మనం ఎక్కడ ఉన్నా, మన పనితనం తో ఇక్కడి, మన దేశ, రాష్ట్ర, గ్రామ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాం.. ఉంటామన్నారు. దేశ సంపద పెంపులో, నిర్మాణంలో మనమే ముందున్నామని ఎర్రబెల్లి పేర్కొన్నారు. భారత్ - అమెరికాల మధ్య సారథ, వారధులుగా ఎన్ఆర్ఐలు నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని, విడిపోయాక రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి అభిప్రాయాన్ని తెలిపారు.
Next Story