Mon Dec 23 2024 18:20:24 GMT+0000 (Coordinated Universal Time)
వైద్య చరిత్రలోనే అద్భుతం.. తెగిన తలను అతికించిన వైద్యులు
రోజూ స్కూల్ నుంచి ఇంటికి రాగానే తప్పనిసరిగై తన సైకిల్ పై రద్దీగా ఉండే వ్యాలీలో రోడ్లపై చక్కర్లు కొట్టాల్సిందే.
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారన్న నానుడి ఉంది. ఓ బాలుడి విషయంలో ఇదే నిజమైంది. చావు అంచుల వరకూ వెళ్లిన ఆ బాలుడికి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. దాదాపుగా శరీరం నుంచి వేరైన తలను అతికించి.. బాలుడిని బ్రతికించారు. ఈ అరుదైన, అద్భుతమైన శస్త్రచికిత్స ఇజ్రాయెల్ లో జరిగింది. ప్రస్తుతం ఆ బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. శరీరం నుంచి అంతర్గతంగా విడిపోయిన శిరస్సును అతికించి బాలుడికి మరో జన్మను ప్రసాదించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇజ్రాయెల్ దేశంలో జోర్డాన్ వ్యాలికి చెందిన 12 ఏళ్ల సులేమాన్ హసన్ కు సైకిల్ రైడ్ అంటే ఎంతో ఇష్టం. రోజూ స్కూలల్ నుంచి ఇంటికి రాగానే తప్పనిసరిగై తన సైకిల్ పై రద్దీగా ఉండే వ్యాలీలో రోడ్లపై చక్కర్లు కొట్టాల్సిందే. జాగ్రత్తగా వెళ్లాలని తల్లిదండ్రులు తరచూ అతడిని హెచ్చరించేవారు. ఓ రోజు సైకిల్ రైడింగ్ కు వెళ్లిన హసన్ ను కారు ఢీ కొట్టింది. తీవ్రగాయాల పాలైన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు బ్రతకడం కష్టమని తేల్చేశారు. జెరూసలేంలోని హదస్సా ఈన్ కెరెమ్ ఆసుపత్రికి చెందిన వైద్యులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు.
హసన్ మెడభాగంలో తీవ్ర గాయాలవ్వడంతో పాటు పొత్తికడుపులోనూ బలమైన గాయాలైనట్లు గుర్తించారు. తల, శరీరం దాదాపు ఒకదాని నుండి మరొకటి వేరైన స్థితిలో హసన్ ను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆర్తోపెడిక్ సర్జన్ డా.ఓహాద్ ఈనావ్ తెలిపారు. శిరస్సుతో వెన్నెముకను కలిపే భాగంగా దాదాపు ఊడిపోయినట్లు గుర్తించారు. ఆ పరిస్థితిని చూసి షాకయ్యామని వైద్యులు తెలిపారు. వెంటనే అతనికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించి.. అన్నివిభాగాల స్పెషలిస్ట్ వైద్యులంతా కలిసి కొన్నిగంటల పాటు శ్రమించి హసన్ కు శస్త్రచికిత్స చేశామన్నారు. ట్రామ్ సిబ్బంది చేసిన ప్రాథమిక చికిత్స నుంచి.. శస్త్రచికిత్స వరకూ ప్రతిఒక్క వైద్యుడి సాంకేతిక అనుభవం హసన్ ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో ఎంతో ఉపయోగపడిందని డా. ఓహాద్ ఈనావ్ తెలిపారు. తమ ప్రయత్నం సక్సెస్ అయిందని, ప్రస్తుతం ఆ బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు. గత నెలలో హసన్ కు శస్త్రచికిత్స చేయగా.. ఈ నెలలో డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు.
బతకడనుకున్న తమ కుమారుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులకు చెమ్మ గిల్లిన కళ్లతో హసన్ తండ్రి ధన్యవాదాలు చెప్పారు. ''మా ఒక్కగానొక్క బిడ్డను తిరిగి ప్రాణాలతో తమకు అప్పగించిన వైద్యులకు నేను జీవితాంతం రుణపడి ఉంటా. ప్రమాదం జరిగిన తర్వాత బతికే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అపార అనుభవం కలిగిన వైద్య సిబ్బంది, సాంకేతికత, సత్వర నిర్ణయం, ట్రామా, ఆర్థోపెడిక్ బృందాలే మా అబ్బాయిని కాపాడాయని.. అందుకు తాను వారికి పెద్ద థ్యాంక్స్ చెప్పడం మినహా ఏమీ చేయలేనని హసన్ తండ్రి చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు.
Next Story