Sun Dec 22 2024 21:31:38 GMT+0000 (Coordinated Universal Time)
నిండుకున్న ఆక్సిజన్.. టైటాన్ సబ్ మెరైన్ జాడెక్కడ ?
అత్యవసర పరిస్థితుల్లో జలాంతర్గామిలో 96 గంటలపాటు ఆక్సిజన్ ఉండేలా దానిని రూపొందించారు. మరో రెండు గంటల్లో..
టైటానిక్ శకలాలను చూసేందుకు ఆదివారం న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి అట్లాంటిక్ సముద్రగర్భంలోకి వెళ్లిన టైటాన్ మినీ జలాంతర్గామి కోసం మూడురోజులుగా రెస్క్యూసిబ్బంది గాలిస్తున్నా ఇంతవరకూ దాని జాడ కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు వినిపిస్తున్నా.. రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి కనిపించలేదు. సముద్రగర్భంలో కొన్నివేల కిలోమీటర్ల లోతులో మినీ జలాంతర్గామి ఉన్నట్లుగా భావిస్తున్నప్పటికీ.. ఇంతవరకూ జాడ కనిపించకపోవడం, మరోవైపు అందులోని ఆక్సిజన్ నిల్వలు నిండుకోవడంతో.. సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. భారత కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 7.15 గంటల వరకే టైటాన్ మినీ జలాంతర్గామిలో ఆక్సిజన్ సరిపోతుంది.
ఈ జలాంతర్గామి ఆచూకి కోసం అమెరికా కోస్ట్ గార్డ్, కెనడా సైనిక విమానాలు, ఫ్రెంచ్ నౌకలు, టెలీగైడెడ్ రోబోలు భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో జలాంతర్గామిలో 96 గంటలపాటు ఆక్సిజన్ ఉండేలా దానిని రూపొందించారు. మరో రెండు గంటల్లో అది కూడా నిండుకోనున్న నేపథ్యంలో దాని ఆచూకీ కనిపిస్తుందో లేదోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సోనార్ సామర్థ్యం కలిగిన కెనడా విమానం బుధవారం కూడా కొన్ని శబ్దాలను గుర్తించింది. అయితే అవి గల్లంతైన శకలానివేనని భావించారు కానీ.. ఖచ్చితంగా ఎక్కడి నుంచి శబ్దాలు వస్తున్నాయో స్పష్టత లేదు. గల్లంతైన జలాంతర్గామిలో పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈలో ఉంటున్న బ్రిటీష్ వ్యాపారవేత్త, హమీష్ హార్డింగ్, యాత్ర నిర్వాహకుడు అండ్ ఓషన్ గేట్ వ్యవస్థాపకుడైన స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ ఉన్నారు.
Next Story