Mon Dec 23 2024 10:52:59 GMT+0000 (Coordinated Universal Time)
అపార్ట్మెంట్ కింద 200కు పైగా మృతదేహాలు
మైరు అవెన్యూలోని అపార్ట్మెంట్ శిధిలాలను తొలగిస్తున్నప్పుడు, సుమారు 200 మంది బాధితుల మృతదేహాలు నేలమాళిగలో..
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించి రష్యా ఎంతో మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైంది. మరియపోల్ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడి సాధారణ ప్రజానీకానికి కూడా తీవ్ర కష్టాన్ని తెచ్చిపెట్టింది. రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన మరియపోల్లో శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఓ అపార్ట్మెంట్ సెల్లార్ లో ఎంతో దుర్గంధం వచ్చింది. లోపలికి వెళ్లి చూసిన అధికారులు అక్కడి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. దాదాపు 200 వరకు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. రష్యా దాడుల్లో నగరంలో దాదాపు 21 వేల మంది మృతి చెందినట్టు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. సామూహిక పూడ్చివేతలు చేపడుతూ ఈ దారుణాలు వెలుగులోకి రాకుండా రష్యా జాగ్రత్తపడుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది.
"మైరు అవెన్యూలోని అపార్ట్మెంట్ శిధిలాలను తొలగిస్తున్నప్పుడు, సుమారు 200 మంది బాధితుల మృతదేహాలు నేలమాళిగలో అధిక శాతం కుళ్ళిపోయినట్లు కనుగొనబడ్డాయి" అని జర్నలిస్టులు తెలియుపారు. చనిపోయినవారి మృతదేహాలను సేకరించడానికి, భద్రపరచడానికి నిరాకరించడంతో, రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ కేవలం శవాలను సంఘటన స్థలంలో వదిలివేసింది. అక్కడ అంతా దుర్వాసన వెదజల్లుతోంది. రష్యన్ సాయుధ దురాక్రమణ మారియుపోల్ నగరంలో అత్యంత ఘోరమైన మానవతా విపత్తులకు కారణమైందని ప్రపంచ దేశాలు ఇప్పటికే ఆరోపించాయి. రష్యన్ ఆక్రమణదారులు నిరాయుధ పౌరులపై బాంబు దాడి చేశారు మానవతా సహాయాన్ని కూడా అడ్డుకున్నారు. నగరం చాలా వరకూ శిథిలావస్థకు చేరుకుంది. విద్యుత్, నీరు, గ్యాస్ సరఫరా లేకుండా పోయింది. సీవియెరోదొనెట్స్క్, దాని చుట్టుపక్కల నగరాలను చుట్టుముట్టిన రష్యా దళాలు వాటిని పూర్తిగా దిగ్బంధం చేసేందుకు పెద్ద ఎత్తున బలగాలను మోహరించాయి. స్విట్లోడార్స్క్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని తమ జెండాను ఎగురవేశాయి.
దాదాపు మూడు నెలల తర్వాత మరియపోల్ రష్యా వశమైంది. రష్యన్ దళాలు ఇప్పటికే పలు నగరాలను ఆక్రమించుకున్నాయి. ఇప్పుడు అక్కడ 100,000 మంది ప్రజలు మాత్రమే ఉన్నారు. యుద్ధానికి ముందు 450,000 జనాభాను కలిగి ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజల్లో చాలా మంది ఆహారం, నీరు వంటి కనీస వసతులు లేకుండా జీవిస్తున్నారు. రష్యా ముట్టడిలో కనీసం 21,000 మంది చనిపోయారని ఉక్రెయిన్ అంటోంది.
Next Story