Mon Nov 25 2024 11:23:42 GMT+0000 (Coordinated Universal Time)
చనుబాల విరాళంతో.. గిన్నీస్ రికార్డుకెక్కిన మాతృమూర్తి
ఒకటి కాదు రెండు కాదు.. 1599.68 లీటర్ల చనుబాలను ఆమె విరాళంగా ఇచ్చింది. పిల్లలకు పాలిస్తే తమ అందం పాడవుతుందని..
పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంత అవసరమో.. అవి ఎంత ఆరోగ్యకరమో ప్రతి ఒక్కరికీ తెలుసు. తెలియని వారు కూడా తెలుసుకునే టెక్నాలజీ నేడు మన అరచేతిలో స్మార్ట్ ఫోన్ రూపంలో ఉంది. బిడ్డ శారీరక ఎదుగుదల, ఆరోగ్యంలో తల్లిపాలే కీలక పాత్ర పోషిస్తాయి. కానీ కొందరు పిల్లలు పుట్టగానే రకరకాల కారణాలచేత తల్లులకు దూరమవుతుంటారు. అలాంటి పిల్లల్లో ఎంతోమందికి ఓ మాతృమూర్తి తన చనుబాలను విరాళంగా ఇచ్చి.. గిన్నీస్ రికార్డుకెక్కింది. ఒకటి కాదు రెండు కాదు.. 1599.68 లీటర్ల చనుబాలను ఆమె విరాళంగా ఇచ్చింది. పిల్లలకు పాలిస్తే తమ అందం పాడవుతుందని భావించే తల్లులున్న ఈ రోజుల్లో ఈమె ఏకంగా అన్ని లీటర్ల చనుబాలను దానం చేయడం మామూలు విషయం కాదు. అలా తన చనుబాలతో ఎంతోమంది పిల్లల ఆకలి తీర్చడంతో పాటు.. వారి ఎదుగుదలకు ఆమె కీలకపాత్ర పోషించింది.
అమెరికాలోని ఒరెగాన్ కు చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియోర్రాకు ఇద్దరు పిల్లలు. తన బిడ్డలకు చనుబాలు పట్టడంతో పాటు 2015 నుంచి 2018 మధ్యలో 1599.68 లీటర్ల పాలను విరాళంగా ఇచ్చింది. ఈ లెక్క కేవలం ఆమె బ్యాంకులకు ఇచ్చినవి మాత్రమే. ఇవే కాకుండా ప్రత్యక్షంగా, వివిధ రూపాల్లోనూ ఆమె తన చనుబాలను నవజాత శిశువులకు అందించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఎలిసాబెత్ మాట్లాడుతూ.. "ఓ సారి ప్యూర్టెకికోలో ఓ నవజాత శిశువు ప్రసవం సమయంలోనే తల్లిని కోల్పోయింది. ఆ చిన్నారిని రక్షించుకునేందుకు తండ్రి ఒక మిల్క్ బ్యాంక్ నుంచి పాలు కొంటున్నారు. నా భర్తది ప్యూర్టెకికో కావడంతో ఓసారి ఆ ద్వీపానికి వెళ్లాను. ఆ బిడ్డ గురించి తెలిసి నేనే పాలిచ్చాను. ఆ తర్వాత నా చనుబాలతో వేలాదిమంది పసికందుల ఆకలి తీర్చడం సంతోషంగా అనిపించేది" అని పేర్కొన్నారు. హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా ఎలిసాబెత్ కు పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవట.
Next Story