Tue Dec 24 2024 00:37:50 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి
తాజాగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బొడగల వంశీరెడ్డయ్య అనే విద్యార్థి గుండెపోటుకు..
చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతూ.. చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలో, విదేశాల్లోనూ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బొడగల వంశీరెడ్డయ్య అనే విద్యార్థి గుండెపోటుకు గురై మరణించాడు. 23 ఏళ్ల వంశీ.. న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ కాలేజీలో ఎంఎస్ చేసేందుకు గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. వంశీ తండ్రి లవకుమార్ ప్రముఖ తెలుగు దినపత్రికలో చీఫ్ ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగంతో తిరిగి వస్తాడనుకున్న కొడుకు.. ఇలా హఠాన్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
డబ్ల్యూహెచ్ఓ సూచన
చిన్నవయసులోనే గుండెపోటుకు గురై, అకాల మరణాలకు కారణం సోడియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోడమేనని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. సోడియం వినియోగాన్ని తగ్గిస్తే.. 2030 నాటికి 70 లక్షలమంది జీవితాలను కాపాడవచ్చని సూచించింది. వంటల్లో వేసే మసాలా, ఉప్పు ఇలా మనం ఒకరోజులో తినే ఆహారంలో సగటున 10.8 గ్రాముల సోడియం ను తీసుకుంటున్నామని ఇది.. డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదించిన 5 గ్రాముల కంటే ఎక్కువే ఉండటం గమనార్హం. సోడియం మోతాదును తగ్గిస్తే.. గుండెజబ్బుల బారి నుంచి రక్షణ పొందవచ్చని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
Next Story